దశాబ్దాల నిరీక్షణ
ABN , First Publish Date - 2020-12-14T03:24:19+05:30 IST
ఆర్డీఎస్ సాగు నీరు చివరి ఆయకట్టు రైతులకు అందని ద్రాక్షగా మారింది.

ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు అందని నీరు
మరమ్మతుల ప్రతిపాదనలన్నీ పెండింగ్‌లోనే..
కాల్వకు గండి పడి నీట మునిగిన వరి పొలాలు
పరిశీలించిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం
ఆర్డీఎస్ సాగు నీరు చివరి ఆయకట్టు రైతులకు అందని ద్రాక్షగా మారింది. ఈ నీటి కోసం ఆరు దశాబ్దా లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఆర్డీఎస్ కింద దాదాపు 90 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, కాల్వలు, డిస్ర్టిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడంతో కేవలం ఐదు నుంచి పది వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. ఆర్డీఎస్ కాల్వకు 12వ డిస్ర్టిబ్యూటరీ వద్ద శనివారం గండి పడటంతో వరి పంట నీట మునిగి, రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.
- గద్వాల, ఆంధ్రజ్యోతి
ఆర్డీఎస్ 12వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు శనివారం తెల్లవారు జామున గండి పడింది. అయిజ మండలం సింధనూరు సమీపంలో 12వ డిస్ట్రిబ్యూటరీ సమీపంలో ఉన్న 21ఏ యూటీ(అండర్ టన్నల్) పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో కాల్వ నీరంతా నల్లవాగు ద్వారా సింధనూరు, టీటీదొడ్డి, కుట్కనూరు గ్రామాల్లోని వరి పొలాలను ముంచెత్తింది. వంద ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రస్తుతం కోతలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కాల్వకు గండి పడి, పంటలు నీట మునగడంతో కోసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రతిపాదనలకే పరిమితం
ఆర్డీఎస్‌ను 1956లో నిర్మించారు. కర్ణాటక ప్రాంతం నుంచి సింధనూరు వరకు 2005లో లైనింగ్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి మరమ్మతులకు నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన అనంతరం ఆర్డీఎస్‌కు ఒక్కపైస నిధులూ కేటాయించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులకు రూ.60 కోట్లు, 38, 39, 40 డిస్ట్రీబ్యూరీల పూర్తి మరమ్మతులకు రూ.15 కోట్లు, షెట్టర్లు, గేట్ల కోసం మరో రూ.70 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఆర్డీఎస్‌కు ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినా, కాల్వలు సరిగా లేకపోవడంతో నీరందడం లేదు. గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు మరమ్మతులకు నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గండిని పరిశీలించిన ఎమ్మెల్యే అబ్రహం
ఆర్డీఎస్ కాల్వకు పడిన గండిని ఎమ్మెల్యే అబ్రహాం ఆదివారం పరిశీలించారు. పంటలు నీట మునిగిన రైతులకు సాయం చేయిస్తానని హామీ ఇచ్చారు. గండిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. గండి పూడ్చడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.