తండాలో తాగునీటికి కట కట

ABN , First Publish Date - 2020-11-20T04:54:30+05:30 IST

ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసినా, పక్కనే చెరువులు, కుంటలు నిండుకుండలా ఉన్నా, తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు.

తండాలో తాగునీటికి కట కట
వ్యవసాయ పొలాల్లోంచి నీటిని తీసుకువస్తున్న తండావాసులు

రెండు నెలలుగా రాని మిషన్‌ భగీరథ నీరు

కొత్తతండాలో గిరిజనుల అవస్థలు


చిన్నచింతకుంట, నవంబరు 19 : ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసినా, పక్కనే చెరువులు, కుంటలు నిండుకుండలా ఉన్నా, తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు.  మండలంలో ని ఉంద్యాల కొత్తతండాలో గిరిజనులు రెండు నెలలు గా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం పరితపిస్తున్నారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా పైపులు వేసి, నల్లాలు బిగించింది కానీ, చుక్కనీరు రావటం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాకు వారానికి ఒక్క మారు నీటిట్యాంకు వస్తున్నా, అదికూడాసగం ట్యాంకు వరకు తెచ్చి, మాకు కొద్దిపాటి నీటిని అందిస్తున్నా రని గిరిజనులు వాపోతున్నారు. దీనిపై సర్పంచ్‌కు చెప్పినా పట్టించుకోవటం లేదని అంటున్నారు. పాల తండాలో నీరున్నా, అక్కడి వెళ్తే వారు రానివ్వటం లే దని, గత్యంతరం లేక కిలోమీటర్ల దూరంవెళ్లి వ్యవ సాయ పొలాల్లో నీళ్లు తెచ్చుకుంటున్నామని అంటు న్నారు. వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారు అంత దూరం వెళ్లి తీసుకురావాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉం దని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ట్యాంకు డ్రైవర్‌ను బతిమిలాడినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కో సారి డబ్బులు ఇచ్చిన వారికే నీరు ఇస్తున్నారని తండావాసులు పేర్కొంటున్నారు. 

రెండు నెలలుగా మిషన్‌ భగీరథ నీరు లేదు


రెండు నెలలుగా మా తండాకు మిషన్‌ భగీరథ నీరు రావటం లేదు. ఎంతో ఆర్భాటంగా పైపులు వేసారు. నల్లాలు బిగించారు. కానీ, చుక్కనీరు రావటం లేదు. దాంతో దిష్టిబొమ్మల్లా నల్లాలు న్నాయి. అవి ఉన్నా, లేనట్టే లెక్క. 

- రాములమ్మ, కొత్తతండా

ఫిల్టర్‌ నీరు కొనుక్కొని తాగుతున్నాం

తండాలో చుక్కనీరు రావటం లేదు. కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. ఇక గత్యం తరం లేక, ఫిల్టర్‌ నీటిని కొనుక్కొని తాగుతున్నాం. ట్యాంకర్‌ వచ్చినా, అదీనూ సగం వరకే నీరు రావ టంతో, అరకొర నీటితో అవస్థలు పడుతున్నాం. 

- గోవిందమ్మ, కొత్తతండా

అధికారులు పట్టించుకోవాలే

 అసలు మా తండాకు ఎవ్వరూ రారు. గ్రామ సర్పంచ్‌ కూడా పట్టించుకోవటం లేదు. మాకు తాగటానికి నీరు లేదు. అధికారులు మా గోడును పట్టించుకోవటం లేదు. ధర్నా చేస్తామన్నా, ఏమైనా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. 

- బూట్లీ, కొత్తతండాUpdated Date - 2020-11-20T04:54:30+05:30 IST