-
-
Home » Telangana » Mahbubnagar » Drains cut off by heavy rains
-
మరమ్మతులు లేవ్?
ABN , First Publish Date - 2020-10-07T05:52:29+05:30 IST
చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో నిండి అలుగు

భారీ వర్షాలకు తెగిపోయిన కాలువలు
మరమ్మతులకు ప్రతిపాదనలు పంపని అధికారులు
కేఎల్‌ఐ, భీమా కాలువల కింద వేలాది ఎకరాల్లో పంట నష్టం
చెరువుల్లో నీళ్లు ఉండటంతో మరమ్మతులపై తీవ్ర నిర్లక్ష్యం
మరమ్మతులు చేయాలని రైతుల విన్నపం
వనపర్తి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారాయి. కానీ, అన్నదాతల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. వనపర్తి జిల్లాలో ప్రధాన ఎత్తిపోతల పథకాలైన భీమా ఫేజ్-2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద కాలువలు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ఎత్తిపోతల కింద ఉన్న డిస్ర్టిబ్యూటరీ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నింటికి గండ్లు పడటంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా గోపాల్‌పేట, వీపనగండ్ల, రేవల్లి, పానగల్, ఆత్మకూరు మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కాలువలకు గండ్లు పడిన వెంటనే గండ్లు పూడ్చడం కోసం, ఇతర మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. అయితే, పలు ఎత్తిపోతల పథకాల అధికారులు మరమ్మతుల కోసం అసలు ప్రతిపాదనలే పంపించలేదని తెలుస్తోంది. ఎలాగూ చెరువులు నిండాయి కదా అని, వారు మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. కానీ, జిల్లాలో మెజారిటీ పొలాలకు కాలువల ద్వారానే సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలో కాలువలు తెగి, నీటి విడుదల నిలిచిపోవడంతో ఆయకట్టులో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటలు ఎండిపోతున్నాయని, కాలువల ద్వారా నీరు వస్తుందని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
నాణ్యత నాసి.. నిధులు మేసి
కల్వకుర్తి, భీమా ఫేజ్-2 కింద జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మెయిన్ కెనాల్ నుంచి తూడుకుర్తి వద్ద డి-8 నిర్మించి, దాని ద్వారా గోపాల్‌పేట, రేవల్లి, పానగల్ మండలాలకు నీరందిస్తున్నారు. కల్వకుర్తి ఆధారంగానే పెద్దమందడి, ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు గండ్లు పడలేదు. కానీ, ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ తరచూ కోతలకు గురవుతోంది. డి-8 అయితే చాలాసార్లు తెగిపోయింది. కాలువ నిర్మాణంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ గండ్లు పడి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. ఇటీవల గోపాల్‌పేట మండలం చాకల్‌పల్ల్లి, పానగల్ మండలం తెళ్లరాళ్లపల్లి వద్ద కాలువకు గండి పడి దాదాపు రెండు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. అలాగే పానగల్, వీపనగండ్ల మండలాల్లో భీమా కాలువలకు గండ్ల సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి సారి కాలువల గండ్లను త్వరగా పూర్తి చేసే అధికారులు, ఈసారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రంగసముద్రం కింద ఆందోళనలో రైతులు
రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 16వ ప్యాకేజీ కాలువకు గండి పడడంతో 21 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. 10 రోజుల కిందట భారీ వర్షాలకు వీసపగండ్ల మండలంలో 14వ కిలోమీటర్ వద్ద ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో సంగినేనిపల్లి, తూంకుంట, సంపత్‌రావుపల్లి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలువ తెగిపోవడంతో రంగసముద్రం తూంలను మూసి వేశారు. రైతులు వానాకాలంలో వేసిన పంటలు ఇన్నాళ్లు తడి ఉన్న కారణంగా వరి పంట బాగానే ఉంది. కానీ, ఇప్పుడు ఎండలు తీవ్రమయ్యాయి. దీంతో పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. అయితే, భీమా అధికారుల వద్ద నిధులు లేకపోవడం, ప్రభుత్వానికి అంచనాలు కూడా పంపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల నుంచి వరి పంటలకు నీరు అందకపోవడంతో తాము అప్పులు చేసి, పంటలు సాగుచేశామని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ప్రాజెక్టు కింద రబీలో సాగు చేసిన వేరుశనగకు నెల రోజుల నుంచి నీరు అందక ఎండిపోయే దశకు చేరుకుంది. వెంటనే అధికారులు స్పందించి తెగిన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.