దైవానికి ప్రతిరూపమే డాక్టర్లు

ABN , First Publish Date - 2020-07-02T11:39:27+05:30 IST

దైవానికి ప్రతిరూపం కనిపించే డాక్టర్లేనని, వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

దైవానికి ప్రతిరూపమే డాక్టర్లు

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

కరోనా బాధితుల కోసం ప్రత్యేక హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం


మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) జులై 1: దైవానికి ప్రతిరూపం కనిపించే డాక్టర్లేనని, వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం డాక్టర్ల దినోత్సవం సందర్భంగా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి, కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా హెల్త్‌కేర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి మంత్రి, కలెక్టర్‌ వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్యుల దినోత్సవం కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి బీసీ రాయ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా డాక్టర్లను, వైద్య, శానిటేషన్‌ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. వారిపై పూలవర్షం కురిపించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ రాయ్‌ చేసిన సేవలను గుర్తించి, ప్రభుత్వం డాక్టర్స్‌ డేను నిర్వహిస్తోందన్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రోగులే కుటుంబ సభ్యులుగా వైద్యులు సేవలు చేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలు వైరస్‌కు వణుకుతున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది వారి ప్రాణాలను ఫనంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.


తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్‌ ఆస్పత్రి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో 17 మంది డాక్టర్లు ఉంటే నేడు 70 మంది ఉన్నారన్నారు. స్టాఫ్‌ నర్సులు 70 మంది నుంచి 400 మందికిపైగా పెంచామన్నారు. కొంతమంది డాక్టర్లు బయటి ప్రాక్టీస్‌కే శ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అవి మానుకోవాలని చెప్పారు.


కరోనా హెల్త్‌కేర్‌ సెంటర్‌ ప్రారంభం: ఆస్పత్రి ఆవరణలోని మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనంలో కరోనా హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు దానిని ప్రారంభించారు. అందులో ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. కరోనా బాధితులకు వేరుగా వైద్య సేవలు అందించేందుకు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.


కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రాంకిషన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు డా. జీవన్‌, డా.నర్సింహారావు, గైనిక్‌ విభాగాధిపతి డా.రాధ, వివిధ విభాగాల అధిపుతులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-02T11:39:27+05:30 IST