హాంఫట్‌..ఇనాం, ముంపు భూములకు పట్టాలు

ABN , First Publish Date - 2020-07-28T11:02:46+05:30 IST

ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియను ఆసరాగా చేసుకొని, కొందరు రాజకీయ నాయకులు, అధికారులు అక్రమ దందాకు తెరలేపారు.

హాంఫట్‌..ఇనాం, ముంపు భూములకు పట్టాలు

అనువంశికం పేరిట కొత్త పట్టాలు చేస్తున్న అక్రామర్కులు

ఇదేమని ప్రశ్నిస్తే లీడర్‌ వద్ద పంచాయితీ తేల్చుకోవాలని హితవు

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే అనుచరుడి పేరిట జోరుగా భూ దందా

సహాయ సహకారాలు అందిస్తున్న రెవెన్యూ శాఖ


వనపర్తి, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియను ఆసరాగా చేసుకొని, కొందరు రాజకీయ నాయకులు, అధికారులు అక్రమ దందాకు తెరలేపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ఎమ్మెల్యేకు అనుచరుడిగా చెప్పుకుంటున్న అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో భూ దందాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ముంపు భూములకు పట్టాలు చేయించడం దగ్గర నుంచి ఇనాం భూముల పట్టాల మార్పిడి, సాదాబైనామాల పేరిట పట్టాల బదలాయింపు, అనువంశికంగా వచ్చినట్లు నూతన ఆర్‌ఓఆర్‌లు సృష్టించడం చేస్తున్నారు. ఇందుకు ఆ మండల రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘మంపు భూములకు పట్టాభిషేకం’ పేరిట శ్రీశైలం ముంపు భూములను పట్టా చేస్తున్నారనే విషయంపై ఓ కథనాన్ని ప్రచురించగా, ఇప్పటి వరకు స్పందన రాలేదు. అయితే, పత్రికల్లో రాస్తే ఏమవుతుంది? తనకు ఎమ్మెల్యే బలం ఉన్నదని ఆ అనుచరుడు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఊర్లోలేని వారికి, ఊరికి సంబంధంలేని వారికి కూడా ఇనాం భూములు ఇవ్వడం, ఓఆర్‌సీ (అక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌) లేకుండానే డిజిటల్‌ సంతకం చేయడం ఇందులో కొసమెరుపుగా చెప్పవచ్చు. 


ముంపు పట్టాలు ఇలా..

1981లో శ్రీశైలం జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని జటప్రోలు, కొప్పునూరు, అయ్యవారిపల్లి, కాలూరు, చెల్లెపాడు, వెంకటాంపల్లి, వెల్టూరు, చిన్నమారూరు, పెద్దమారూరు, గూడెం, బెక్కెం, గడ్డబస్వాపూర్‌ గ్రామాల పరిధిలో దాదాపు పది వేల ఎకరాలు ముంపులో పోయాయి. ఇందులో నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మిగిలినవి ఆయా గ్రామాల రైతుల నుంచి సేకరించినవి. ప్రభుత్వం సేకరించిన భూములను రికార్డుల్లో ఇవి ముంపు భూములు అని ఏనాడో నమోదు చేసింది. తాజాగా అవినీతికి ఆశపడిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ముంపు భూములకే తిరిగి పట్టాలు చేస్తున్నారు.


పెద్దమారూరు గ్రామ శివారులో సర్వే నంబర్‌ 18లో 7.19 ఎకరాల భూమి 1981లో శ్రీశైలం నిర్మాణ సమయంలో అధికారులు సేకరించారు. రికార్డుల్లోనూ ముంపు భూములుగా డిక్లేర్‌ చేశారు. అయితే, ఇదే సర్వే నంబర్‌కు సంబంధించి రత్నారెడ్డి అనే వ్యక్తి పేరిట పట్టా అయ్యింది. ఆర్‌ఓఆర్‌లో 2019లో పట్టా అయినట్లు నమోదు కావడంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం కూడా ఆ వ్యక్తి పేరిట విడుదలైంది. ప్రస్తుతం ఆ వ్యక్తి రైతుబంధు, పంట రుణాలు పొందుతున్నాడు. ఈ సర్వే నంబర్‌ మాత్రమే కాదు, చాలా సర్వే నంబర్లలోని భూములకు ఇలా అక్రమపట్టాలు ఇస్తున్నారు.


ఓఆర్‌సీ లేకుండానే పట్టా

చిన్నంబావి మండలం పెద్దమారూరుకు చెందిన చాకలి భీమయ్యకు 4.16 ఎకరాలు కేటాయిస్తూ 1998లోనే ఓఆర్‌సీ వచ్చింది. అయితే, భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత అందులో 30 గుంటల భూమిని వేరే వ్యక్తుల పేరిట పట్టా చేశారు. ఇదేమని అడిగితే సాదాబైనామాల ద్వారా చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే గ్రామంలో 345ఆ/1/2/1 సర్వే నంబర్‌లో 6.16 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఈ భూమిని సదరు నేత సహకారంతో కొసికె మహేందర్‌రెడ్డి పేరిట పట్టా చేశారు. అతడికి ఆ భూమికి ఎలాంటి సంబంధంలేకపోవడం, గతంలో ముస్లింల పేరిట ఉన్న ఈ భూములను ఓఆర్‌సీ లేకుండానే పట్టాచేసి డిజిటల్‌ సంతకం కూడా చేశారు.


క్యాన్సలేషన్‌ కోసం ఫైలు పంపాం

శ్రీశైలం ముంపు భూములకు పట్టా విషయంలో పొరపాటు జరిగింది. దాన్ని సరిదిద్దుతున్నాం. కావాలని చేసింది కాదు. ఇనాం భూములకు డిజిటల్‌ సంతకం చేసి పట్టా పేర్కొనడంలో కూడా పొరపాటు జరిగింది. ఆయన దగ్గర తనదే భూమి అన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే క్యాన్సలేషన్‌ కోసం ఆర్డీఓ కార్యాలయానికి ఫైలు పంపించాం. 

- పాండునాయక్‌, తహసీల్దార్‌, చిన్నంబావి


నేత దగ్గర మాట్లాడుకోమన్నారు 

నాకు సర్వే నంబర్‌ 90లో ఐదెకరాల భూమి ఉంది. అందులో 4.16 గుంటలు ఓఆర్‌సీ ద్వారా సంక్రమించగా, 24 గుంటలు నేను కొనుగోలు చేశాను. ఈ భూమిలో 30 గుంటలు ఇటీవల వేరే వ్యక్తుల పేరిట అధికారులు పట్టా చేశారు. ఇదేమని అడిగితే మీ ఊర్లో నేత వద్ద పంచాయితీ ఉంటే అక్కడ సెటిల్‌ చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.

- చాకలి భీమయ్య, రైతు, పెద్దమారూరు

Updated Date - 2020-07-28T11:02:46+05:30 IST