దళారీ..దోపిడీ

ABN , First Publish Date - 2020-11-07T10:17:03+05:30 IST

ఉల్లి మార్కెట్‌ను దళారులు శాసిస్తున్నారు. ఇటు తక్కువ ధర చెల్లించి రైతులను, అటు ఎక్కువ ధరకు విక్రయిస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు

దళారీ..దోపిడీ

భారీ వర్షాలతో తగ్గిన ఉల్లి దిగుబడులు

ఇదే అదునుగా ధరలు పెంచేసిన వ్యాపారులు

గడ్డలు నాణ్యతగా లేవని రైతులకు తక్కువ ధర చెల్లింపు

అవే గడ్డలను రెట్టింపు ధరలకు వినియోగదారులకు అంటడగుతున్న దళారులు

మహారాష్ట్ర నుంచి తెస్తున్నామని కుంటి సాకులు

ధరలను నియంత్రించడంలో విఫలమవుతున్న అధికారులు

ప్రత్యేక ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్న వినియోగదారులు


దేవరకద్ర, నవంబర్‌ 6 : ఉల్లి మార్కెట్‌ను దళారులు శాసిస్తున్నారు. ఇటు తక్కువ ధర చెల్లించి రైతులను, అటు ఎక్కువ ధరకు విక్రయిస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. పంట పండించిన రైతుకు నాణ్యత లేదనే సాకుతో క్వింటాల్‌కు రూ.6 వేలకు మించి ధర ఇవ్వని వ్యాపారులు, దళారీలు, అదే ఉల్లిగడ్డలని మార్కెట్లో వినియోగదారులకు క్వింటాల్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అంటగడుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని, దోపిడీని ప్రశ్నించే వారు లేకపోవడం, నియంత్రించే వ్యవస్థ కనిపించకపోవడంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.


మేలు రకం కాదని..

మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రతి ఏటా దాదాపు 30 వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డలను ఉత్పత్తి చేస్తారు. ఈ ఏడాది అధిక వర్షాల నేపథంలో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 వేల క్వింటాళ్లకే దిగుబడి పరిమితమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మార్కట్‌లో మాత్రమే ఉల్లిగడ్డల క్రయవిక్రయాలు కొనసాగుతాయి. అయితే, ఈ ఏడాది దిగుబడులు తగ్గడంతో, ఇప్పటికే పెట్టుబడులు కోల్పోయిన ఉల్లి రైతులను వ్యాపారులు సైతం ముంచుతున్నారు. ఉల్లిగడ్డ నాణ్యంగా లేదనే సాకుతో నంబర్‌ వన్‌ రకం కాకుండా రెండో రకం, మూడో రకం ధరలనే రైతులకు ఇస్తున్నారు. గడ్డలు లావుగా లేవని, నల్లగా ఉన్నాయని క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తున్నారు. ఇవే గడ్డలను వినియోగదారులకు అమ్మేటప్పటికి రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి సరుకు తెప్పిస్తున్నామని, అందు వల్లే ధర పెరిగిందని నింపాదిగా చెబుతున్నారు. 


ధరలపై నియంత్రణ కరువు

ఉల్లిగడ్డల ధరల నియంత్రణపై అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. రైతులకు అండగా ఉండి, నాణ్యమైన ఉల్లికి మంచి ధర ఇప్పించడమే కాకుండా, ఉల్లిగడ్డలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు. దీంతో దళారీలు, వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్‌ దుకాణాల ద్వారానైనా, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసైనా ఉల్లిగడ్డల విక్రయించి, ధరలను నియంత్రించాలనే సూచనలు వస్తున్నాయి.


ఉల్లిగడ్డలు కొనాలంటే కన్నీళ్లే

ఉల్లిగడ్డల ధర గతంలో ఎన్నడూ లేనంత పెరిగింది. చిన్న చిన్న గడ్డలు కూడా అధిక ధర చెబుతున్నారు. కిలో రూ.82 చెల్లిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గతంలో వలె ప్రభుత్వం ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

- పద్మ


దిగుబడులు లేక కొరత

స్థానికంగా ఉల్లి దిగబడులు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వస్తున్న ఉల్లిగడ్డల్ని మేం పాలమూరు మార్కెట్లో కొని తెస్తున్నాం. రేటు ఎక్కువగా చెల్లిస్తున్నాం. మా చేతిలో ఏమీ లేదు. రెండో రకం ఉల్లిగడ్డలకు కూడా మేం క్వింటాల్‌కు రూ.80 వరకు చెల్లిస్తున్నాం. 

- శేఖర్‌, కిరాణావ్యాపారి

Updated Date - 2020-11-07T10:17:03+05:30 IST