పత్తి రైతు పరేషాన్‌

ABN , First Publish Date - 2020-09-29T06:11:18+05:30 IST

పత్తి రైతు పరేషాన్‌లో పడ్డాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట తెగుళ్ల బారిన పడటంతో ఆందోళన చెందుతున్నాడు

పత్తి రైతు పరేషాన్‌

వరుస వర్షాలతో పంటకు తెగుళ్లు

జిల్లాలో 4,56,384 ఎకరాల్లో సాగు

పెట్టుబడులూ వచ్చే అవకాశం లేదంటున్న అన్నదాత


అచ్చంపేట, సెప్టెంబరు 28: పత్తి రైతు పరేషాన్‌లో పడ్డాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట తెగుళ్ల బారిన పడటంతో ఆందోళన చెందుతున్నాడు. ఈ ఏడాది నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురువడంతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో మెట్ట పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారు. 6 లక్షలా 10వేలా 558 ఎకరాల్లో మెట్ట పంటలను వేశారు. ప్రధానంగా పత్తి 4,56,384 ఎకరాల్లో సాగు చేశారు. అచ్చంపేట డివిజన్‌లో 1,87,926 ఎకరాల్లో నాటారు. పంట గూడ పట్టే సమయానికి వర్షాలు ఎక్కువగా కురవడంతో తెగుళ్ల బారిన పడుతున్నాయని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.


20 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆశలు సన్నగిల్లతున్నాయని వాపోతున్నాడు. జొన్న, సజ్జ పంటలు అప్పుడే కోతకు రాగా, ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తికి ఎర్ర గుమ్మడి, పచ్చ దోమ, తెల్ల దోమ, ఆకు ముడత తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అచ్చంపేట మండలం మార్లపాడు తండాలో పత్తి పంట దాదాపు 150 ఎకరాల వరకు ఎస్‌ఎల్‌బీసీ బ్యాక్‌ వాటర్‌ వల్ల నీట మునిగింది.


కష్టాల కడలిలో మెట్ట రైతులు

మెట్ట రైతులకు ఎప్పుడూ కష్టాలు తప్పడం లేదు. అతివృష్ఠి, అనావృష్ఠి రైతులను అగాధంలోనికి నెట్టేస్తున్నాయి. అచ్చంపేట డివిజన్‌లో ఓ పక్క అడవి పందులు, కోతుల బెడద, మరో పక్క ఎడతెరపిలేని వర్షాలతో పంటలు నీట మునిగి రైతులు కష్ఠాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు.


మా కష్టం మొత్తం పోయింది 

ఏడు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి వేశాను. రూ.35 వేలు పెట్టుబడి అయ్యింది. కౌలు రూ.40 వేలు ఇయ్యాలె. సేను మొత్తం ఎర్రగ అయిపోయింది. మా కష్టం మొత్తం పోయింది. ఎట్ల బతకాలో ఏందో. సర్కారు ఆదుకోవాలే. 

- రైతు నేనావత్‌ జైపాల్‌, ఎద్దుమిట్టతండా

Updated Date - 2020-09-29T06:11:18+05:30 IST