కరోనా కట్టడికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2020-03-16T08:09:11+05:30 IST

కరోనా మహమ్మారిని జిల్లాలోకి రానివ్వకుండా అరికట్టేందుకు అధికార యం త్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా ఆదివారం అన్నారు.

కరోనా కట్టడికి సిద్ధం కావాలి

అధికారుల సమావేశంలో కలెక్టర్‌  శ్రుతి ఓఝా


గద్వాలక్రైం, మార్చి 15 : కరోనా మహమ్మారిని జిల్లాలోకి రానివ్వకుండా అరికట్టేందుకు అధికార యం త్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా ఆదివారం అన్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు ఈ నెల 31వరకు మూసివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఏ సంస్థ వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయనున్న విద్యార్ధులు మినహా మిగిలిన వారందరినీ వారిళ్లకు సెలవులపై పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. సినిమాహాళ్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు, స్విమ్మింగ్‌ పూల్‌లు ఈ నెల ఈ 31వరకు మూసి వేయాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ముహూర్తాలు నిశ్చయించుకున్న పెళ్లిళ్లు తప్ప అన్ని పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, ఇప్పుడు నిశ్చయించుకున్న వివాహాలు సైతం 200మంది కి మించకుండా చేసుకోవాలని పేర్కొన్నారు.


ఎక్కువ మంది ఒక దగ్గర గుమిగూడి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, సమావేశాలు ఈ నెల 31వరకు నిర్వహించరాదని తెలిపారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృధ్ధి అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగు లు ఎవరూ సెలవుల్లో వెళ్లడానికి వీలులేదని ఆదేశించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో, ఆసుపత్రుల్లో అదనపు పారిశుధ్య పనులు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌ వ్యాధి చికిత్సలకై కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనలు అనుసరించి అన్ని సౌకర్యాలతో కూడిన వార్డు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.


కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలి

కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝా అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయం త్రం కలెక్టర్‌ ఛాంబర్‌లో అన్ని మండలాల తహసీల్దార్లు, ఆరోగ్యశాఖ అధికారులు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ వాట్సాప్‌లలో ప్రజలకు కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే అట్టివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిగ్రామంలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్‌ రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇళ్లకు ఎవరైనా కొత్తవ్యక్తులు వస్తే వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవాలని, వారికి దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వారి సమాచారం తహసీల్దార్లు, వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి వచ్చాక చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు తెలుపాలని ఆదేశించారు. 


ప్రస్తుతం గద్వాల లో కరోనా వైరస్‌ నిర్ధారణకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని, ఇందుకు 16 బెడ్లు ఏర్పాటుచేశామని కలెక్టర్‌ వెల్లడించారు. ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధులకు చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి విద్యార్థి చేతులు కడుక్కొని పరీక్ష కేంద్రంలోకి వెళ్లేలా చూడాలన్నారు. జిల్లాలో మద్యంబార్‌లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా పూర్తి వివరాలకు జిల్లా ఆసుపత్రి నెం. 8008553810కు సమాచారం అందించాలని కలెక్టర్‌ తెలిపారు. గ్రామాల్లో కరోనా వైరస్‌ ను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టాంటాం వేయించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డీఎంహెచ్‌ఓ సునీత, ఏఎస్పీ కృష్ణ, డీఈఓ సుశీందర్‌రావు, ఎస్సీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి రాములు, తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-03-16T08:09:11+05:30 IST