పొగాకు అమ్మకాలపై..కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-06-18T10:53:25+05:30 IST

పొగాకు అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. దిగుబడులు వచ్చిన సమయంలో రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో, పంటను కొనుగోలు చేసే కంపెనీలు ముందుకు రాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌

పొగాకు అమ్మకాలపై..కరోనా ఎఫెక్ట్‌

లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు ఆలస్యం

ఆందోళన చెందుతున్న రైతాంగం


గద్వాల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : పొగాకు అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. దిగుబడులు వచ్చిన సమయంలో రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో, పంటను కొనుగోలు చేసే కంపెనీలు ముందుకు రాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా, కంపెనీలు మాత్రం ఆశించిన మేర కొనుగోళ్లు జరుపడం లేదు.


జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, ఉండవల్లి, ఇటిక్యాల మండలాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేస్తారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటు సాగు కాగా, 12 వేల క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. అయితే అలంపూర్‌లో పండించే పొగాకును రైతులతో ముందుగా ఒప్పందం చేసుకొని, వచ్చిన దిగుబడులను హైదరాబాద్‌కు చెందిన వీఎస్‌టీ కంపెనీ కొనుగోలు చేస్తుంది. గతంలో ఎకరానికి మూడు, నాలుగు కింటాళ్ల దిగుబడులు వస్తుండగా, ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి.


కరోనా ఎఫెక్ట్‌తో పొగాకు కొనుగోలు చేసే ఈ కంపెనీ కొనుగోళ్లకు ఆలస్యంగా వచ్చింది. ముందుస్తుగా చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం మూడు, నాలుగు క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదనంగా వచ్చిన రెండు, మూడు క్వింటాళ్లను కొనుగోళ్లు చేయలేమని చేతులెత్తేసింది.


దీనికి తోడు కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన డబ్బులు చెల్లించడం కంష్టంగా ఉందని, విడతల వారీగా చెల్లింపులు చేస్తామని చెబుతుండటంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ విషయంపై వీఎస్‌టీ కంపెనీల మేనేజర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా వచ్చిన పొగాకు దిగుబడులను మొత్తం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

Updated Date - 2020-06-18T10:53:25+05:30 IST