కరోనా రహిత జిల్లాకు సహకరించండి

ABN , First Publish Date - 2020-04-14T11:59:58+05:30 IST

జోగుళాంబ గద్వాలను కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు

కరోనా రహిత జిల్లాకు సహకరించండి

హోంక్వారంటైన్‌లో ఉన్నవాళ్లు బయటకు రావొద్దు

డ్రోన్‌ కెమెరాతో కంటైన్‌మెంట్‌ జోన్లను పరిశీలిస్తున్నాం

విలేకర్ల సమావేశంలో ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు


గద్వాల క్రైం, ఏప్రిల్‌ 12 : జోగుళాంబ గద్వాలను కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు కోరారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా నుంచి మర్కజ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన 51మందిలో 19మందికి కరోనా పాజిటివ్‌ రాగా క్వారంటైన్‌కు పంపామన్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరిని కలిసిన విషయాలను సీసీ కెమరాల ద్వారా పరిశీలించి వారిని కూడా క్వారంటైన్‌కు పంపినట్లు తెలిపారు. నెగటివ్‌ ఉన్న వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామన్నారు.


జిల్లాను మొత్తం ఆరు క్లస్టర్లుగా తీసుకొని గద్వాలలోనే 4 క్లస్టర్‌ విభాగాలతో కంటైన్మెంట్‌ ఏరియాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో ఎవరూ బయటకు రాకుండా, బయటి వారు ఎవరూ ఆయా ఏరియాల్లోకి వెళ్లకుండా డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ జోన్లలో ఉన్న వారి ఇళ్ల వద్దకే సరుకులు వచ్చేలా చర్యలు తీసుంటున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులతో కలిపి జిల్లాలో మొత్తం 46 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. పదే పదే రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసులు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హనుమంతు, ఎస్‌ఐలు సత్యనారాయణ, కృష్ణఓబుల్‌రెడ్డి, బాలవెంకటరమణ తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-04-14T11:59:58+05:30 IST