వాన నీటిని ఒడిసి పట్టరా..!

ABN , First Publish Date - 2020-06-16T10:54:46+05:30 IST

పాలమూరు ఉమ్మడి జిల్లాలో వాననీటిని ఒడిసిపట్టి, నీటి ఇక్కట్లు తీర్చే పథకాలపై అధికారయంత్రాంగానికి శ్రద్ధ కరువయింది. భారీ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల

వాన నీటిని ఒడిసి పట్టరా..!

 వర్షపు నీటి వినియోగంపై కరువైన శ్రద్ధ

 పాలమూరు మెట్టప్రాంతాల్లో సాగునీటిఇక్కట్లు

 ఏటా కనీసం 150టీఎంసీల వాననీరు వృథా

 వాగుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల ఏర్పాటుతో వాననీటి సంరక్షణ

 ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలనే డిమాండ్‌

 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై ప్రభుత్వ కసరత్తు

 తాజాగా 64 నిర్మాణాలకు రూ.332 కోట్ల మంజూరు

 వాగులపై రిజర్వాయర్లు చేపట్టాలనే సూచన

 వాననీటిని ఒడిసి పడితేనే మెట్టప్రాంతాలు సస్యశ్యామలం

 

 (మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

 పాలమూరు ఉమ్మడి జిల్లాలో వాననీటిని ఒడిసిపట్టి, నీటి ఇక్కట్లు తీర్చే పథకాలపై అధికారయంత్రాంగానికి శ్రద్ధ కరువయింది. భారీ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల విషయంలో సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం, ఇప్పట్లో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతో నీరందే అవకాశం లేని మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలతో పాటు  నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట వంటి మెట్టప్రాంతాలకు సాగునీరందించే వనరులను వృద్ధిచేయడంలో, ఉన్నవనరులను కాపాడడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందనే విమర్శ ఈప్రాంత రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది.


ఈప్రాంతాల్లో సాగుకు ఆధారమైన వాగులలో ఇసుకతవ్వకాలను నిషేధించడంతో పాటు వాటిపై ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని, తద్వారా వాననీటిని ఒడిసిపట్టి, భూగర్భజలాలను పెంచే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ ఈ ప్రాంత రైతాంగం నుంచి వస్తోంది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై ఇటీవల దృష్టిసారించిన ప్రభుత్వం మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట డివిజన్‌లో వీటిని విస్తృతంగా నిర్మించాలనే సూచనలు వస్తున్నాయి. 604 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యే పాలమూరు ఉమ్మడిజిల్లాలో మహబూబ్‌నగర్‌, నారాయణఫేట ప్రాంతాల్లో ఒక్కోసంవత్సరం ఇది 580మిల్లీమీటర్లకు కూడా పడిపోతోంది. ఇంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైనప్పటికీ, ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు లేకపోవడంతో ప్రతియేటా కనీసం 157 టీఎంసీల వాననీరు వృథాగా పోతోందని, కనీసం ఈ నీటినైనా పోకుండా ఇక్కడే వినియోగించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలనే సూచనలు వస్తున్నాయి. 


157 టీఎంసీల వర్షపునీరు వరదపాలు:

వర్షపునీటిని సద్వినియోగంలో పాలమూరు పూర్తిగా వెనకబడింది. వాననీటిని భూమిలోకి ఇంకింపజేసేందుకు అమలు చేస్తున్న పలుపథకాల కింద  కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది.  జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయితే 394.26 టీఎంసీలు నీరు అందుబాటులో ఉంటుందని, ఇందులో 41శాతం నీరు (161.59టీఎంసీలు) ఆవిరిరూపంలో వెళుతుందని, మరో 40శాతం నీరు (157.70టీఎంసీలు) నీరు ప్రవాహంలో వృథా అవుతుందని అంటున్నారు. మరో 10శాతం నీటిని (39.42 టీఎంసీల) భూమిలోని మట్టి పీల్చుకుంటే, కేవలం 9శాతం (35.47టీఎంసీలు) నీరు మాత్రమే భూమిలో ఇంకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రవాహాలలో వెళ్లే నీరంతా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా వినియోగానికి రాకుండా నేరుగా డిండి, శ్రీశైలానికి చేరుతుందని, ఈనీటిని సాధ్యమైనంత మేర ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలాచేసేందుకు అవసరమైన చెక్‌డ్యామ్‌లు, ఊటకుంటలు, నివాస ప్రాంతాల్లో ఇంకుడుగుంతల వంటి నిర్మాణాలు చేపట్టాలనే సూచనలు వస్తున్నా, కార్యాచరణ అమల్లోకి రాకపోవడంతో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, అచ్చంపేట వంటి మెట్టప్రాంతంలో వ్యవసాయం ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతాల్లో బోరుబావుల కింద 2,09,093 హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ఈబోరుబావులకు వాననీరే శరణ్యమైన నేపథ్యంలో ఈ వాన నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. 


వాగుల పునరుద్ధరణ కేంద్రంగా నిర్మాణాలు చేపట్టాలనే డిమాండ్‌:

 కాల్వల ద్వారా నీటివనరులకు నోచుకోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో వర్షపునీటిని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలి. ఇక్కడి రైతాంగం నుంచి, జలవనరుల నిపుణుల నుంచి ఈ డిమాండ్‌ వస్తోంది.  వర్షపునీరు ప్రవాహంలో కొట్టుకుపోకుండా భూగర్భంలో ఇంకేలా, వాగుల్లో ఎక్కడికక్కడ  చిన్నచిన్న రిజర్వాయర్లతో పాటు, చెక్‌డ్యామ్‌లు నిర్మించి, నీరు నిల్వ ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికరైతులు కోరుతున్నారు. ఇందుకనుగుణంగా నీటిపారుదలశాఖ సర్వే నిర్వహించి ప్రత్యేక పథకం రూపొందించాలి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్న దుందుభి నది, ఊకచెట్టువాగు, పెద్దవాగు, నాగిరెడ్డిపల్లి వాగులను పునరుజ్జీవింపచేయాల్సి ఉంది. ఈ వాగులన్నీ ప్రస్తుతం అడ్డగోలు ఇసుకతవ్వకాలతో  రూపం కోల్పోయాయి. ఒకప్పుడు జీవనదుల్లా పారే ఈవాగులు కాస్తా వరదలొచ్చినప్పుడు మాత్రమే ప్రవహించేలా కుచించుకుపోయాయి. కోస్గి మండలంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి మొదలయ్యే పెద్దవాగు కోస్గి, మద్దూరు, కోయిలకొండ మండలాల మీదుగా కోయిలసాగర్‌ ప్రాజెక్టుని చేరుతుంది.


కోయిలసాగర్‌ దిగువనుంచి సీసీకుంట, మదనాపూర్‌ మండలాల మీదుగా రామన్‌పాడు చేరే ఊకచెట్టువాగుదీ ఇదే పరిస్థితి. సరళాసాగర్‌కు నీరిచ్చే పెద్దవాగు కూడా మూసాపేట, అడ్డాకుల, భూత్పూర్‌, మండలాల్లో ఇసుకతవ్వకాలతో రూపం కోల్పోయింది. బాలానగర్‌, రాజాపూర్‌, జడ్చర్ల, ఉర్కొండపేట మీదుగా కల్వకుర్తి, తెల్కపల్లి, వంగూరు మండలాల నుంచి డిండి ప్రాజెక్టుకు చేరే దుందుభి వాగు కూడా ఇదేరీతిన రూపం కోల్పోయింది. వాగుల్లో నిల్వ ఉన్న ఇసుకతవ్వకాలకు ప్రభుత్వమే పట్టాభూముల్లో ఇసుకమేటల పేరుతో అనుమతులివ్వడంతో వాటి ముసుగులో నదీగర్భాన్ని తొలచి ఇసుక రేణువు లేకుండా తోడేస్తున్నారు. భారీ వానలు పడ్డప్పుడు సైతం నీరు వేగంగా కిందకు వెళ్లిపోవడమే తప్ప ఇసుకమేటల్లేకపోవడంతో భూమిలో ఇంకేందుకు, వాగుల్లో నిల్వ ఉండేందుకకు అవకాశం లేకుండా పోయింది. ఈ వాగులపై నీటిపారుదలశాఖ అధ్యయనం చేసి, వీలైన చోట్ల మినీ రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలనే కోరుతున్నారు. ఇసుకతవ్వకాలను పూర్తిగా నిషేధించి ఈనిర్మాణాలు చేపడితే వృధాగా పోయే వర్షపునీటిలో కనీసం 100 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకోవచ్చని, తద్వారా బోరుబావులు రీచార్జి అయి సాగుకు ఇబ్బందితప్పుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 


చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై సీరియస్‌గా దృష్టిసారిస్తే ప్రయోజనం:

కోవిద్‌-19 నేపథ్యంలో ఆర్థికవనరులు తగ్గిపోవడం, అంతర్రాష్ట్ర జలవివాదాల నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి  ఎత్తిపోతల పథకం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం, రైతాంగం నుంచి వస్తోన్న విస్తృతడిమాండ్‌ నేపథ్యంలో పాలమూరులో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కందూరు పెద్దవాగు, ఊకచెట్టువాగు, దుందుభిపై 24 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు,  నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు, ఎక్లాస్‌పూర్‌, మందిపల్లి, ఉట్కూరు పెద్దవాగులపై తొమ్మిది చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు,  నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దుందుభినది, ఇతర వాగులపై 21 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు, వనపర్తి జిల్లాలో 10, గద్వాల జిల్లాలో నాలుగు చెక్‌డ్యామ్‌లక కలిపి మొత్తం 74 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపగా, వీటిలో64 నిర్మాణాలకు రూ.332.52 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటితో పాటు మరిన్నిచెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టాలని, అదేవిధంగా వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా మినీ రిజర్వాయర్ల నిర్మాణాలపై లోతుగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించడం ద్వారా మెట్టప్రాంతాలకు నీటి ఇక్కట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం రైతాంగం నుంచి వస్తోంది. 

Updated Date - 2020-06-16T10:54:46+05:30 IST