పరిహారం.. ప్లీజ్‌

ABN , First Publish Date - 2020-10-30T10:42:06+05:30 IST

భారీ వర్షాలతో పంటలు మునిగిపోయి జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే, కాలువలకు గండ్లు పడటం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం వల్ల సమీపంలోని పొలాలు కోతలకు గురవడం, రోడ్లు తెగిపోయి ..

పరిహారం..  ప్లీజ్‌

మునుపెన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలు

 చెరువులు, ఎత్తిపోతల పథకాల కాలువలు పడిన గండ్లు

కొన్ని చోట్ల పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలు

వనపర్తి జిల్లాలో 10,056 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల నివేదికలు

క్షేత్రస్థాయిలో అంతకు రెట్టింపు దెబ్బతిన్న పంటలు

నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి రైతుల విన్నపాలు

ఈ ఏడు బీమా లేకపోవడంతో పరిహారంపై స్పష్టత కరువు


ఈ ఏడు వనపర్తి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.. సాధారణం కంటే 137 శాతం అధికంగా వర్షం కురిసింది.. ఎన్నడూ లేనంతగా వర్షాల వల్లే, జిల్లాలో వెయ్యికిపైగా చెరువులు, కుంటలు నిండి, అలుగు పారాయి.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. కొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాల కాలువలు తెగి కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. గతేడాది వరకు ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టం జరిగితే పరిహారం ఇచ్చేందుకు ఫసల్‌ బీమా పథకం ఉండగా, ఈసారి ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపట్టపోవడంతో రైతాంగం నష్టాన్ని పూడ్చుకునే మార్గాలు కనిపించక ఆందోళన చెందాల్సిన పరిస్థితి దాపురించింది..


వనపర్తి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షాలతో పంటలు మునిగిపోయి జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే, కాలువలకు గండ్లు పడటం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం వల్ల సమీపంలోని పొలాలు కోతలకు గురవడం, రోడ్లు తెగిపోయి పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడం వల్ల జరిగిన నష్టం వనపర్తి జిల్లాలో భారీగా ఉంది. జిల్లా పరిధిలో మెజారిటీ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టుల్లో జూరాల ఒకటి కాగా, ఈ ప్రాజెక్టు కాలువల కింద పెద్దగా నష్టం జరగకపోయినా, ఆత్మకూరు మండలం మూలమళ్ల గ్రామంలో వంద ఎకరాలకుపైగా వరి నీట మునిగింది. రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 కింద కొత్తకోట, వనపర్తి, వీపనగండ్ల, పానగల్‌ మండలాలకు నీరు అందుతుంది. అయితే, వీటి కాలువలు వీపనగండ్లలో రెండుసార్లు తెగిపోయాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గోపాల్‌పేట మండలం చీర్కపల్లి వద్ద, పానగల్‌ మండలంలో ఓ చోట కాలువలకు గండిపడింది. శ్రీరంగాపూర్‌లోని రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తడం వల్ల సమీపంలో ఉన్న పొలాలు కోతకు గురి కావడంతో పాటు, వందల ఎకరాల్లో వరి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.


అలాగే అన్ని మండలాల్లో రహదారుల ధ్వంసం వల్ల కూడా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రతీసారి గండ్లు పడుతున్నాయని, పంటలు సాగు చేసి నష్టపోవడం ఆవేదన కలిగిస్తోందని రైతులు చెబుతున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటల రైతులు ఎలాగోలా వచ్చే సీజన్‌తోనైనా నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తుండగా, పూర్తిగా నష్టపోయిన రైతులు మాత్రం నష్టం ఎలా భర్తీ చేసుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఫసల్‌ బీమా యోజన లేక ముందు ప్రకృతి వైపరిత్యాల్లో జరిగిన నష్టాన్ని ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రైతులకు అందించే వారు కాగా, ఇప్పుడా రెండు లేవు. దీంతో ప్రభుత్వమే నష్టం అంచనా వేసి, పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 


10,056 ఎకరాల్లో నష్టం

ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 10,056 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కానీ, మరో ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల పంటలు ఎక్కువగానే దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న పంటలను మాత్రమే అధికారులు లెక్కించడం వల్ల లెక్కలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మెజారిటీ వాటా 7,610 ఎకరాల్లో వరి దెబ్బతినగా, 1,205 ఎకరాల్లో వేరుశనగ, 735 ఎకరాల్లో పత్తి, 121 ఎకరాల్లో కంది, మూడు ఎకరాల్లో పెసర, 27 ఎకరాల్లో ఆముదం, 20 ఎకరాల్లో మినుములు, 30 ఎకరాల్లో జొన్న, 305 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ఉన్నాయి. అయితే, మొక్కజొన్న అధికారిక లెక్కల కంటే దారుణంగా దెబ్బతిన్నది. కేవలం చిన్నంబావి మండలంలో మాత్రమే ఈ పంట సాగు చేయగా, దాదాపు రెండు వేల పైచిలుకు ఎకరాల్లో ఈ పంట దెబ్బతిన్నది. ఇవి కాక ఉల్లి, మిరప పంటలలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి అధికారులు 10,056  ఎకరాల నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని నష్ట పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-30T10:42:06+05:30 IST