చివరి రోజు భక్తుల జోరు
ABN , First Publish Date - 2020-12-02T03:37:21+05:30 IST
తుంగభద్ర నది పుష్కరాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ముగిసిన తుంగభద్ర నది పుష్కరాలు
రాజోలి, డిసెంబరు 1: తుంగభద్ర నది పుష్కరాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఘాట్ వద్ద సందడిగా మారింది. మంగళవారం 15 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. మొత్తం 97 వేల మంది భక్తులు రాజోలి పుష్కరఘాట్‌లో స్నానం ఆచరించినట్లు ఎంపీడీవో గోవిందు రావు తెలిపారు. అనంతరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠ నారాయణ స్వామి దేవాలమం ఎండోమెంట్ ఏవో పురేంధర్ ఆధ్వర్యంలో అధికారికంగా నదికి మహా మంగళ హారతి నిర్వహించారు. రాజోలి జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వ ర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందు రావు, తహసీల్దార్ వెంకటరమణ, ఎస్‌ఐ శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ గోపాల్ పాల్గొన్నారు.
ముబారక్ హెల్పింగ్ నేచర్ యూత్‌కు సన్మానం
పుష్కరాల్లో ముబారక్ హెల్పింగ్ నేచర్ యూత్ పేరుతో భక్తులకు ఉచి తంగా టీ, బిస్కెట్ పంపిణీ చేశారు. దీంతో వీరిని అభినందిస్తూ రాజోలి గ్రామ పెద్దలు సన్మానం కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ షాషావలి, గ్రామ పెద్దలు గోవర్ధన్‌రెడ్డి, షాలు, లక్ష్మీ నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రకా ష్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన పుష్కరాలు
అయిజ: వేణిసోంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రనది పుష్కర కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం ఆఖరి రోజు కావడంతో సర్పంచ్ నర్సోజి, మాజీ సర్పంచ్ నర్సింహులు, సునీల్‌లు అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సన్మానించారు.
అందరి కృషితో పుష్కరాలు విజయవంతం: కలెక్టర్
పుష్కర కార్యక్రమాలు విజయవంతం కావడం వెనకాల ప్రతి ఒక్కరి కృషి ఉందని కలెక్టర్ శృతిఓఝా అన్నారు. మంగళవారం ఆమె వేణిసోమ్‌పూర్ పుష్కరఘాట్‌ను పరిశీలించారు. భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె సంతానవేణుగోపాల స్వామి, వ్యాసతత్వజ్ఞతీర్థులు, షోడష బాహు లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు భగవానుగ్రహం లభిస్తుంది
అయిజ: భక్తులకు భగవానుగ్రహం లభిస్తుందని ప్రస్తుత మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీవించారు. తుంగభద్ర నది పుష్కరాలను పురష్కరించుకుని ఆఖరి రోజు మంగళవారం వేణిసోంపూర్ గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలు వినిపించారు. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పుష్కరాల్లో మునగడం వల్ల భక్తులకు పుణ్య ఫలం దక్కుతుందన్నారు. ప్రపంచం శాంతియుత వాతావరణంలో, భగవంతుని ధ్యానంతో సుఖసంతోషాలతో ఉండాల ని కోరుకుందామని అన్నారు. వేణిసోంపూర్‌కు ప్రత్యేక ఉందని దీనిని ఆయా వంశీకులు కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రజలందరికీ పుష్కర పుణ్యం దక్కాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బస్సు మోహన్‌రావు, అన్నయ్యాచార్యులు, మూర్తిఆచార్యులు, గుండాచార్యులు, నర్సింగరావులు పాల్గొన్నారు.
ప్రసాద్ స్కీంతో ఆలయాల అభివృద్ధికి కృషి: ఎంపీ రాములు
అలంపూర్: ప్రసాద్ స్కీం నిధులతో అలంపూర్ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు అన్నారు. మంగళవారం ఆలయానికి చేరుకున్న ఎంపీ రాములు కుటుంబ సభ్యులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ జనవరిలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అలంపూర్ దేవాలయ సమస్యను లేవనెత్తి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుష్కరాల్లో వివిధ శాఖల అధికారులు, పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ పుష్కరాలు తన నియోజకవర్గంలో జరగటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహాంల ను ఆలయ కమిటీ ఛైర్మన్ రవిప్రకాశ్‌గౌడ్, ఏసీ శ్రీనివాసులు, ఈఓ ప్రేమ్‌కుమార్ ధర్మకర్తల సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డు ఛైర్మన్ రాందేవ్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, అల్లాబకాష్, టీఆర్‌ఎస్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, రమణ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ పూజలు
ఉండవల్లి: పుష్కరఘాట్‌లో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు దంపతులు, అనంతపురం ఏఎస్పీ రాఘవ, కడప డీఎస్పీ రాజశేఖర్ లు పుష్కరస్నానాలు ఆచరించారు. పుష్కరాల చివరి రోజు 13,786 మంది భక్తు లు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ వరలక్ష్మి తుంగభద్ర నది మాతకు సారెను వాయినంగా సమర్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పుష్కరాలు ముగిసినట్లు ఘాట్ ఇన్‌చార్జి బాబ్జీరావు తెలిపారు.
స్కౌట్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్, ఎస్పీ
అలంపూర్: పుష్కరాల 12రోజుల పాటు వచ్చిన భక్తులకు సేవ చేసిన స్కౌట్స్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ శ్రుతిఓఝా, ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌లు అభినందించారు. చివరి రోజు మంగళవారం రాత్రి స్కౌట్స్ టీం చేసిన సేవలు ఎంతో అద్భుతమని వారు కొనియాడారు. కార్యక్ర మం లో టీం లీడరు రాజు ఉన్నారు.







