చెవికెక్కని చదువు
ABN , First Publish Date - 2020-12-18T04:07:38+05:30 IST
తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులను మినహాయిస్తే ఆన్‌లైన్ తరగతులు ఎవరికీ అర్థం కావడం లేదని తెలుస్తోంది.

అర్థంగాని ఆన్‌లైన్ తరగతులు
జిల్లాలో 50 శాతం మాత్రమే హాజరు
9, 10 విద్యార్థులకేఉపయోగం
మిథ్యగా ప్రాథమిక విద్య
అర్థంగాని బోధనతో అయోమయం
గేమ్‌లు, వీడియోలకు పరిమితం
ప్రత్యక్ష బోధన మొదలైతేనే ప్రయోజనం
వనపర్తి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులను మినహాయిస్తే ఆన్‌లైన్ తరగతులు ఎవరికీ అర్థం కావడం లేదని తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు అసలు ఆన్‌లైన్ తరగతులే వినడం లేదని సమాచారం అందుతోంది. జిల్లాలో 50 శాతంలోపు విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్ తరగతులు వింటుండటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రత్యక్ష బోధన పద్ధతి లేకపోవడంతో పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. ఎప్పటికప్పుడు సందేహాల నివృత్తి కూడా చేయడం లేదు. చిన్నచిన్న అక్షరాల కారణంగా ఆన్‌లైన్ క్లాసుల్లో ఇచ్చే నోట్స్ సరిగా రాసుకోలేకపోతున్నారు. అలాగే ప్రతీ సబ్జక్ట్‌కు 30 నిమిషాలు ఉంటున్నప్పటికీ వివరణాత్మక బోధన ఉండటం లేదు. సెల్‌ఫోన్లు చేతులో ఉండటం.. పర్యవేక్షణ లేకపోవడంతో గేమ్స్ ఆడుకోవడం, యూట్యూబ్‌లో వీడియోలు చూడటం అలవాటుగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రత్యక్ష బోధన పద్ధతిని పునఃప్రారంభించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రాథమిక విద్య మిథ్యనే..
ఆన్‌లైన్ తరగతులను 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 80శాతం వినియోగించుకుంటుండగా 1 నుంచి ఏడో తరగతి వరకు 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే వింటున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే తరగతులు పెద్దవారికే అర్థం అవుతుండటంతో పిల్లలు అసలు వినడం లేదు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండడం లేదు. పట్టణాల్లో మాత్రం గృహిణులు ఆన్‌లైన్ బోధనను పర్యవేక్షిస్తున్నారు. పట్టణాల్లో ఉండే మెజారిటీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారే కావడంతో యాజమాన్యాలు ప్రత్యేక యాప్‌లు లేదా వాట్సాప్‌లకు లింకులు పంపించడం ద్వారా బోధన సాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మాత్రం మరింత దిగజారిపోతోంది. తరగతి గదిలో చెప్పే పాఠాలే బుర్రకెక్కని పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో చాటింగ్, బ్రౌజింగ్ ఎక్కువగా చేస్తుండటంతో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇక వీడియోల రూపంలో వచ్చే చిన్నచిన్న అక్షరాలు కనిపించక కంటి చూపు కూడా మందగించే అవకాశం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు..
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ తరగతుల వినియోగం 40శాతం లోపే ఉంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలోపం.. ఉపాధ్యాయుల సమీక్షలు కూడా సరిగా జరగకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు క్లాసులు వినడం లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఉండటం.. ప్రత్యేక ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. దూరదర్శన్, టీశాట్, నిపుణ తదితర వాటి ద్వారా క్లాసులు నడుస్తున్నప్పటికీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ ఫీజుల మాదిరిగానే వసూలు చేస్తుండడం.. చెల్లించకపోతే ఆన్‌లైన్ తరగతులను నిలిపివేయడం చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనాతో ఉపాధి కరువు కాగా.. టీవీలు, సెల్‌ఫోన్ల కొనుగోలు, డేటా ప్లాన్లు వేసుకోవడం అన్నీ తల్లిదండ్రులకు అదనపు భారమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధన మొదలు పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.