జాబ్‌ పేరుతో బురిడీ

ABN , First Publish Date - 2020-10-07T05:48:40+05:30 IST

చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు ఉద్యోగాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించాడు. పోలీస్‌ శాఖలోని ఓ ఉన్నత స్థాయి అధికారి

జాబ్‌ పేరుతో బురిడీ

ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తానంటూ మోసం

పోలీస్‌ శాఖలోని ఉన్నత స్థాయి అధికారి డ్రైవర్‌ను అంటూ ప్రచారం

అధికారి పేరు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన చందు

మాయమాటలకు మోసపోయిన అమాయకులు

ఉద్యోగాలు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు

అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు


హోంగార్డ్‌ ఉద్యోగం కావాలా? మాకు తెలిసిన ఓ పోలీసు అధికారిని సంప్రదిస్తే ఇట్టే పనైపోతుంది.. కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కావాలా? సార్‌తో మాట్లాడితే నిమిషాల్లో పనైపోతుంది.. ఎండీపీఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ కావాలా? సార్‌ను కలిస్తే మీకు ఉద్యోగం పక్కా అవుతది.. కుల సంఘాలనికి స్థలం కావాలా? సార్‌ అనుకుంటే ఇప్పించేస్తారు.. అంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడకు చెందిన చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు చేస్తున్న మోసాల చిట్ట ఇది.. ఒకొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేయడం ఆయనకు పరిపాటిగా మారింది.. ఇప్పుడు బాధితులంతా ఫిర్యాదులు చేస్తుండటంతో అసలు కథ బయట పడింది..


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 6 : చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు ఉద్యోగాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించాడు. పోలీస్‌ శాఖలోని ఓ ఉన్నత స్థాయి అధికారి తనకు తేలుసని మాయమాటలు చెప్పి, వారిని మోసం చేశాడు. సార్‌ చెబితే ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మించి, వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేశాడు.


సీసీఎస్‌ కేంద్రంగా విచారణ

షాద్‌నగర్‌కు చెందిన బాధితుడు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చందు చేతిలో మోసపోయిన వారంతా ఒకొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. జడ్చర్ల, అలంపూర్‌, వనపర్తి, బిజినేపల్లి, తెలకపల్లి నుంచి బాధితులకు బయటకు వస్తుండటంతో డొంక కదులుతోంది. నిందితులను సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ కేంద్రంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరితో డబ్బులు వసూలు చేశారు? ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పేర్లపై వాహనాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా రవాణా శాఖలో ఆధార్‌ నంబర్‌ ఆధారంగా పరిశీలించారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. చందు తాను ఓ పోలీసు ఉన్నతాధికారి దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాని, సార్‌తో పని చేయిస్తానని నమ్మించడమే కాకుండా సారే మీతో మాట్లాడతారని ఫోన్‌లో మాట్లాడించడం చేశాడు.


అయితే, ఉద్యోగం రావడం ఆలస్యం కావడం, తమతో అంత పెద్దస్థాయిలో ఉన్న అధికారి అంత సమయం కేటాయించి ఎందుకు మాట్లాడతారని బాధితులకు అనుమానం వచ్చి చందును నిలదీయడంతో విషయం కాస్త బయట పడింది. పోలీసు అధికారినంటూ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఆడియోలను బాధితులు పోలీసులకు అందించారు. అవతల మాట్లాడిన వ్యక్తి ఏమాత్రం బెరుకులేకుండా డిపార్ట్‌మెంట్‌లోని వ్యక్తుల పేర్లు చెబుతూ మాట్లాడటం అనుమానం కలిగిస్తోంది. అసలు మాట్లాడిన వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉన్నది. పోలీస్‌ భాషలోనే బాధితులకు డాగులు వేయడం గమనార్హం.


మోసపోయిన బాధితులు

షాద్‌నగర్‌కు చెందిన సల్లా అమర్‌నాఽథ్‌కు హోంగార్డ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చంద్రశేఖర్‌ రూ.5 లక్షలు తీసుకున్నాడు. మొదట రూ.3.50 లక్షలు తీసుకుని, ఆ తరువాత డీజీపీ గారే రూ.1.5 లక్షలు అడుగుతున్నారని మరో లక్షన్నర వసూలు చేశాడు. తీరా ఉద్యోగం ఇవ్వకపోవడంతో గత నెల 2న 10 రోజుల్లో డబ్బులిస్తానని బాండ్‌ రాసిచ్చి హ్యాండిచ్చాడు.


అలంపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి కోర్టులో అటెండర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని ఈ ఏడాది ఫిబ్రవరిలో ముందు రూ.4.50 లక్షలు అకౌంట్‌లో వేయించుకున్నాడు. ఆ తరువాత కోర్టు ఉద్యోగం ఇప్పుడు రాదని, నల్గొండ జిల్లా కోదాడ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.2 లక్షలు వసూలు చేశాడు.


జడ్చర్లకు చెందిన కుల సంఘం నేతకు సంఘం భవనం కోసం స్థలం ఇప్పిస్తానని రూ.1.50 లక్షలు వసూలు చేశాడు. ఇలా చాలా మందితో లక్షలకు లక్షలు వసూలు చేశాడు. అన్ని చోట్ల మధ్యవర్తిని నియమించుకుని వారి ద్వారా డబ్బులు వసూలు చేశాడు. ఇతనికి హన్వాడ గ్రామానికి చెందిన మరో వ్యక్తి సహకరించాడు.

Updated Date - 2020-10-07T05:48:40+05:30 IST