చెల్లని బాండ్లు

ABN , First Publish Date - 2020-09-25T10:17:51+05:30 IST

: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2005లో ఆడపిల్లల సంరక్షణ కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌

చెల్లని బాండ్లు

- కొత్త బాలికా సంరక్షణ పథకానికి చెల్లిన కాలం

- ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ప్రవేశపెట్టిన వైఎస్‌ ప్రభుత్వం

- రాష్ట్ర విభజనతో నిలిచిపోయిన పథకం

- పథకాన్ని రద్దు చేసిన తెలంగాణ  సర్కారు

- బాండ్లకు మెచ్యూరిటీ వచ్చినా జరగని చెల్లింపులు

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 23 వేల పైచిలుకు బాండ్లు


వైఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కొత్త బాలికా సంరక్షణ పథకం తుడుచుపెట్టుకుపోయింది.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైపోయింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. దీనికితోడు పథకం కింద ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన షేర్‌మనీ చెల్లించకుండా నిలిపివేయడంతో, ఎల్‌ఐసీ నుంచి బాలికా సంరక్షణ బాండ్లకు మెచ్యూరిటీ వచ్చినా చెల్లింపులు జరపని పరిస్థితి దాపురించింది..


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2005లో ఆడపిల్లల సంరక్షణ కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొత్తబాలికా సంరక్షణ పథకం ప్రవేశపెట్టారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాల్లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేశారు. ఒకే ఆడపిల్లతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటే ఈ పథకం కింద నమోదు చేసుకుంటే, ఆ బాలిక ఎనిమిదో తరగతి నుంచి నుంచి ఇంటర్‌ చదువు పూర్తయ్యేంత వరకు ప్రతియేటా స్కాలర్‌షిప్పు అందించడంతో పాటు, బాలికకు 20 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత చదువులకు వివాహానికి రూ.లక్ష నగదు అందిస్తారు. ఇద్దరు బాలికలైతే ఇద్దరికీ 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్కాలర్‌షిప్పులు కొనసాగిస్తూ, 20 సంవత్సరాల నిండిన తర్వాత ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున అందిస్తారు. ఐసీడీఎస్‌ ద్వారా అమలయ్యే ఈ పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలు చేశారు.


బాలికల తరుఫున ఎల్‌ఐసీకి ప్రభుత్వమే షేర్‌మనీ చెల్లించేది. ఎల్‌ఐసీ ద్వారా బాలికలకు వారి స్థితికనుగుణంగా పథకం ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు బాలికలకు బాండ్లు అందజేశారు. 2011 వరకు ఈ పథకం కొనసాగింది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చాక ఈ పథకంపై సమీక్ష జరిపి బంగారుతల్లి పథకంలో కలిపేశారు. ఈ పథకం కింద విడతల వారీగా బాలికలకు నగదు అందించేలా పథకం అమలు చేశారు. మహిళా సంఘాల ద్వారా బాలికల తల్లులు పొదుపు సంఘాల్లో సభ్యులైతే వారి ద్వారా బాలికలకు స్కాలర్‌షిప్పులందించే కార్యక్రమం చేపట్టారు.


అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకాలు కనుమరుగయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఈ పథకాలని సమీక్షించి రద్దు చేశారు. వీటి స్థానంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టామని, కొత్త బాలికా సంరక్షణ పథకం గానీ, బంగారుతల్లి పథకం గానీ అవసరమేలేదని స్పష్టం చేశారు. ఈ పథకం ప్రభుత్వం రద్దు చేయడంతో ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన షేర్‌మనీ చెల్లించకుండా నిలిపివేయడంతో ఎల్‌ఐసీ నుంచి ఈ బాండ్లకు మెచ్యూరిటీ వచ్చినా చెల్లింపులు ఆపేశారు. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం నాయనోనిపల్లికి చెందిన యాదయ్య కుటుంబాన్ని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. యాదయ్యకు సాయికీర్తన, ఇందు కుమార్తెలు. ఇద్దరికీ బాలికా సంరక్షణ పథకం కింద 01.04.2007లో నమోదు చేశారు. దాని ప్రకారం ఇందుకు 4.09.2024న, సాయికీర్తనకు 04.09.2026న బాండ్లకు మెచ్యురిటీ వస్తుంది. ఇందుకు 2017 నుంచి, సాయికీర్తనకు 2019 నుంచి స్కాలర్‌షిప్పులు రావాల్సి ఉంది. అందు కోసం అంగన్‌వాడీ కేంద్రాల వద్ద, జిల్లా ఐసీడీఎస్‌ కార్యాలయాల వద్దకు వస్తే ఈ పథకం అమలులో లేదని, అందువల్ల స్కాలర్‌షిప్పులు ఇవ్వలేమని, పథకం లేనట్లేనని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అప్పట్లో ఈ పథకం కింద 23 వేల మంది బాలికలను నమోదు చేసి, బాండ్లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఆ వివరాలేవీ అందుబాటులో లేవని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-09-25T10:17:51+05:30 IST