భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-11-27T03:35:12+05:30 IST
రాజోలిలో నిర్వహించిన తుంగభద్ర నది పుష్కరాలకు ఏడో రోజూ భక్తులు తరలి వచ్చారు. గురువారం ఒక్క రోజే 8,500 మంది భక్తులు స్నానం ఆచరించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

రాజోలి, నవంబరు 26: రాజోలిలో నిర్వహించిన తుంగభద్ర నది పుష్కరాలకు ఏడో రోజూ భక్తులు తరలి వచ్చారు. గురువారం ఒక్క రోజే 8,500 మంది భక్తులు స్నానం ఆచరించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుంకేసుల డ్యాం నుంచి నీరు పుష్కలంగా విడుదల చేస్తుండటంతో భక్తులు స్నానాలకు అధికంగా వస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, యువకులు, మహిళలు నదిలో ఆనందదాయకంగా పుష్కరస్నానం చేశారు. అనంతరం ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు.
ఘనంగా గంగాభవాని, పరమేశ్వరుల కల్యాణోత్సవం
రాజోలిలో తుంగభద్ర నది సమీపంలో కొలువు దీరిన గంగాభవాని ఆలయంలో గురువారం గంగాభవాని, పరమేశ్వరులకు కత్యిణం ఆశేష భక్తుల సందడిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గంగా పరమేశ్వర్లకు పక్కనే ఉన్న తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి అభిషేకాలు చేశారు. మాధ్యాహ్నం అశేష భక్తుల మధ్య, మత్స్యకారుల ఆధ్వర్యంలో వైభవంగా స్వామి వారితో అమ్మవారికి కల్యాణం జరిపించారు. శుభకార్యాన్ని తిలకించేందుకు సర్పంచు వెంకటేశ్వరమ్మ, ఉప సర్పంచు గోపాల్, గ్రామ పెద్దలు శ్రీరాంరెడ్డి, గంగిరెడ్డి, దస్తగిరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విచ్చేసిన వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ట్రాక్టర్‌పై ఊరేగించారు.
బ్రాహ్మణ అన్నదాన సత్రంలో అన్నదానం
అలంపూర్, నవంబరు 26: పుష్కరాలకు వచ్చే భక్తులకు జోగుళాంబదేవి ఆలయ సమీపంలోని కాశీవిశాలాక్షి అన్నపూర్ణేశ్వరి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో అన్నదాన సౌకర్యం కల్పించారు. బ్రాహ్మణ సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ప్రతికూల వాతావరణంతో తగ్గిన రద్దీ
ఉండవల్లి, నవంబరు 26: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఏడో రోజు గురువారం పుల్లూరు పుష్కర ఘాట్‌లో సుమారుగా 2,500 మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. తుఫాను కారణంగా ఉదయం నుంచి ఆకాశం మబ్బులు వేసుకొని చల్లని ఈదురు గాలులు వీస్తుండడంతో భక్తులు కొంతమేర తగ్గారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా తన తండ్రి బీగాల కృష్ణమూర్తి అస్థికలను పుల్లూరు పుష్కరఘాట్‌లోని తుంగభద్ర నదిలో కలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన వికలాంగుడు కల్లూరి రుక్మానందరావును ఎస్‌పీసీ విద్యార్థులు వీల్‌చైర్‌లో పుష్కరఘాట్ వరకు తీసుకెళ్లి సహాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది థర్మల్‌స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నారు. ఘాట్ దగ్గర పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. సర్పంచ్ నారాయణమ్మ భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న బోజన సదుపాయం కల్పించారు.
వేణిసోంపూరం ఘాట్‌కు భక్తుల రద్దీ
అయిజ, నవంబరు 26: అయిజ మండల పరిధిలోని వేణిసోంపూరం పుష్కరఘాట్‌కు గురువారం భక్తుల తాకిడి పెరిగింది. గురువారం 8, 720 మంది భక్తులు స్నానం చేసినట్లు ఎంపీఓ నర్సింహారెడ్డి తెలిపారు.




