120 రకాల అభివృద్ధికి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-10-31T06:45:11+05:30 IST

మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని జడ్పీటీసీ పోశం నరసింహారావు వెల్లడించారు

120 రకాల అభివృద్ధికి ప్రతిపాదనలు

తొలివిడతగా రూ.15.8 కోట్ల డీఎంఎఫ్‌ మంజూరు.. 

జడ్పీటీసి సభ్యుడు పోశం


మణుగూరురూరల్‌, అక్టోబరు 30: మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని జడ్పీటీసీ పోశం నరసింహారావు వెల్లడించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 120 రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేయగా.. తొలివిడతగా 14 పనుల నిర్వహణకు రూ.15.8 కోట్ల డీఎం నిధులు మంజూరయ్యాయన్నారు. వీటితో నాయుడుకుంట చెరువులోకి భగత్‌సింగ్‌నగర్‌, శేషగిరినగర్‌, బండారుగూడెం ప్రాంతాలకు చెందిన మురుగునీరు వరదనీరు చేరకుండా నేరుగా కట్టువాగులో కలిసేలా రూ.1.14 కోట్లతో కాల్వలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పాత ఆంధ్రబ్యాంక్‌ పక్కనున్న మొట్లవాగు కాలువ అభివృద్ధికి రూ.26.3 లక్షలు, గాంధీనగర్‌, కుంకుడు చెట్ల గుంపు, సుందరయ్యనగర్‌ ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా ఉండేందుకు కట్లువాగు అభివృద్ధికి 39.6 లక్షలు, విప్పలసింగారం చెరువు చెక్‌డ్యాం నుంచి పొలాలకు సాగు నీరందించేందుకు కాలువల నిర్మాణానికి రూ.17.7 లక్షలు, మద్దులగూడెం, సింగారం పొలాలకు సాగునీరందించేందుకు రేగులగండి చెరువు నుంచి కాలువల నిర్మాణానికి రూ.4.2 కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంపౌండ్‌ వాల్‌, గేట్‌ నిర్మాణానికి రూ.13.5 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.


కరకగూడెం మండలం చిరుమళ్ల వంతెనపై రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.58 లక్షలు, అశ్వాపురం మండలం ఎలకలగూడెం హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ.1.2 లక్షలు మంజూరయ్యాయన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో వద్ద ఏడు, జడ్పీ కో ఎడ్యూకేషన్‌ ఉన్నత పాఠశాల వద్ద 18, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద ఎనిమిది షాంపి కాంప్లెక్స్‌ల నిర్మాణానికి రూ.2.65 కోట్లు మంజూరయ్యాయన్నారు. పినపాక మండలం చేగర్శల నుంచి టీ కొత్తగూడెం వరకు రహదారి మరమ్మతులకు రూ.4.85 లక్షలు, గుండాల- ఆళ్ళపల్లి రహదారి మరమ్మత్తులకు 10 లక్షలు, కరకగూడెం ప్రధాన రహదారి, కాలువల మరమ్మత్తు పనులకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనూ శంకుస్థాపనులు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.  రేగులగండి చెరువునుంచి కూనవరం పంచాయతీతోపాటు సింగారం పంచాయతీ రైతుల పొలాలకు సాగునీరందించేందుకు కాలువల నిర్మాణానికి నిధుల మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు సర్పంచ్‌ ఏనిక ప్రసాద్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కారం విజయకుమారి, మండల అధ్యక్షుడు ముత్యం బాబు, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరారావు, నాయకులు అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్‌, కోటేశ్వరరావు, ముద్దంగుల కృష్ణ, బాబ్‌జానీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T06:45:11+05:30 IST