గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2020-05-18T10:07:01+05:30 IST

ఖమ్మం జిల్లాలోని పలుప్రాంతాల్లో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

గాలివాన బీభత్సం

ఖమ్మం జిల్లాలో పలుప్రాంతాల్లో తీవ్రనష్టం

సత్తుపల్లి మండలంలో నేలరాలిన మామిడి

తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర

చింతకాని మండలంలో కలెక్టర్‌ పర్యటన


సత్తుపల్లిరూరల్‌/ఎర్రుపాలెం/కొణిజర్ల/చింతకాని, మే 17: ఖమ్మం జిల్లాలోని పలుప్రాంతాల్లో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పలుపంటలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. సత్తుపల్లి ప్రాంతంలో వడగండ్ల వర్షం పడగా.. ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. పలు గ్రామాల్లో వృక్షాలు నేలకూలగా ఇంటి పైకప్పులు లేచాయి. సత్తుపల్లి పట్టణం, మండంలోని తుంబూరు, నారాయణపురం, తాళ్లమడ గ్రామాల్లో పలు ఇళ్లు, ఫ్యాక్టరీల పైకప్పులు ఎగిరిపోయాయి. మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి సాగవుతుండగా 25శాతం మేర నష్టం వాటిల్లినట్టు ఉద్యానశాఖ అధికారి కె.మీనాక్షి తెలిపారు. అలాగే పలుప్రాంతాలు, గ్రామాల్లో సుమారు 130 విద్యుత్‌ స్తంభాలు విరిగాయని టౌన్‌, రూరల్‌ ఏఈలు తెలిపారు. రేజర్లలో గొర్రెల కాపరి సిద్దినబోయిన బసవయ్య పిడుగుపడి మృతిచెందినట్టు తహసీల్దార్‌ కేవీఎంఏ.మీనన్‌ ధ్రువీకరించారు.


అలాగే ఈదురుగాలుల వేగానికి సత్తుపల్లి పట్టణ శివారులో రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ ప్రయివేట్‌ బస్సు వెనక్కి వచ్చింది. అది కొంతదూరం వెళ్లి చెట్టుకు ఢీకొని ఆగగా ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో నష్టం జరగలేదు. ఈ బస్సు వెనక్కు వెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.  అయితే ఈదురుగాలుల బీభత్సానికి నేలకూలిన ఇళ్లు, కోళ్లఫారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం సందర్శించారు. తుంబూరులో మామిడి తోటలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తానన్నారు. రేజర్లలలో పిడుగుపాటుకు మృతిచెందిన బసవయ్య మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన బూసిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన నాలుగుఎకరాల్లోని బొప్పాయి పంట శనివారం గాలివాన బీభత్సానికి నేలమట్టమైంది. సాగు కోసం రూ.2లక్షల మేర పెట్టుబడులు పెట్టగా.. ప్రస్తుతం చేతికి వచ్చింది.


అయితే ఈ పంటను కోయించి, రవాణా చేసేందుకు లాక్‌డౌన్‌ అడ్డురావడంతో మనోవేదనలో ఉన్న ఆ రైతుకు గాలివాన మరింత నష్టం తెచ్చిపెట్టింది. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు వెంకటరెడ్డి కోరుతున్నాడు. అలాగే కొణిజర్ల మండల వ్యాప్తంగా శనివారం రాత్రి వచ్చిన గాలిదుమారం, వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. అమ్మపాలెంలో శ్మశానవాటిక పైకప్పు ఎగిరిపోయింది. బొట్లకుంటలో పిడుగుపాటుకు ఈదర బాబుకు చెందిన రెండు గేదెలు, జమ్‌కోబంజరలో ఆంగోతు రామకు చెందిన ఒక గేదె మృతి చెందాయి. పలుగ్రామాల్లో హరితహారం కింద రోడ్ల పక్కన నాటిన మొక్కలు వేర్లతో సహా నేలవాలడంతో పంచాయతీ సిబ్బంది ఆదివారం వాటిని సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఆదివారం చింతకాని మండలంలో పర్యటించిన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వందనం, పాతర్లపాడు గ్రామాల్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం, మొక్కజొన్నలను రైతులు అరబెట్టుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వందనంలో గాలి దుమారానికి నేలకొరిగిన బొప్పాయి తోటను ఆయన పరిశీలించారు. గాలి దుమారం, వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీవో లలితకుమారి, నాగులవంచ సొసైటీ అధ్యక్షుడు శేషగిరి, సర్పంచ్‌ సునీత, పలువురు రైతులున్నారు. 

Updated Date - 2020-05-18T10:07:01+05:30 IST