కరోనా నుంచి కోలుకున్న భర్త.. సాయంగా ఆస్పత్రిలోనే ఉన్న భార్యకు టెస్ట్ చేస్తే..
ABN , First Publish Date - 2020-06-16T18:01:57+05:30 IST
కరోనా బారిన పడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న భర్తకు సాయంగా ఉండేందుకు వెళ్లిన భార్యకు కూడా వైరస్ సోకింది. ఖమ్మం నగర పరిధిలోని పాండురంగాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు

మరొకరికి పాజిటివ్
భర్తకు వైద్యం కోసం వెళ్లిన మహిళకు సోకిన వైరస్
ఖమ్మం జిల్లాలో 27కు చేరిన కొవిడ్-19 కేసులు
ఖమ్మం (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న భర్తకు సాయంగా ఉండేందుకు వెళ్లిన భార్యకు కూడా వైరస్ సోకింది. ఖమ్మం నగర పరిధిలోని పాండురంగాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు ఈనెల 4న నిర్ధారణైంది. దీంతో ఆయనను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన కోసం అక్కడే ఉంటున్న అతడి భార్యకు కూడా నాలుగు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి.. శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపగా ఆమెకు కూడా పాజిటివ్ వచ్చినట్టు ఆదివారం రాత్రి రిపోర్టు వచ్చిందని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి ప్రకటించారు. అయితే ఈ కేసుతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది.
భర్త డిశార్జ్ భార్యకు పాజిటివ్..
ఆ కుటుంబ యజమాని కరోనా నుంచి కోలుకోవటంతో సోమవారం గాంధీ ఆసుపత్రి అధికారులు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. దీంతో తన భర్త కరోనా నుంచి కోలుకొని ఇంటికి వస్తున్నాడని సంతోషించే లోపే ఆ మహిళకు వైరస్ సోకడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కామేపల్లి నర్సుకు నెగెటివ్..
కామేపల్లి పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో కామేపల్లి వాసులు భయాందోళనకు గురయ్యారు. సదరు నర్సుకు కూడా కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో శుక్రవారం ఆమెను ఖమ్మంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా.. ఆమెకు లక్షణాలు లేవని రిపోర్టు వచ్చింది. దీంతో మండల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.