పాత వాటి మాటేంటి?

ABN , First Publish Date - 2020-10-07T05:38:31+05:30 IST

అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గాను 2016లో కూడా లే అవుట్‌ రెగ్యులరేజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్రభుత్వం అమలు

పాత వాటి మాటేంటి?

పెండింగ్‌లోనే గత ఎల్‌ఆర్‌ఎస్‌ ధరఖాస్తులు 

2016లో స్వీకరించి.. గోప్యంగా తిరస్కరించిన అధికారులు 

లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు 


ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు 6: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గాను 2016లో కూడా లే అవుట్‌ రెగ్యులరేజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం వివిధ కారణాలు చూపి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దరఖాస్తులను తిరస్కరించారు. ఫీజుల రూపంలో రూ.లక్షలు వసూలు చేసి, వారికి మొండిచేయి చూపారు. ఆతర్వాత కొంతకాలానికి ఈ అంశం ప్రస్తావనకు రావడంతో  పెండింగ్‌లో ఉన్న పాత ఎల్‌ఆర్‌ఎస్‌ ధరఖాస్తులను పరిష్కరిస్తున్నామని ప్రకటించిన అధికారులు దరఖాస్తుదారులను నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు పెట్టలేదని చెబుతూ మళ్లీ కొత్తగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే తాము గతంలో చెల్లించిన సొమ్ముల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదు. దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకుండానే తిరస్కరించటంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 


ఆవేదన వ్యక్తం చేస్తున్న పాత ధరఖాస్తుదారులు..

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ ధరఖాస్తుదారుల గోస చెప్పనలవి కావడం లేదు.  తాము సొమ్ములు చెల్లించినా నెలల తరబడి తిప్పి, ఇప్పుడు తిరస్కరించామని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసి, తొలుత రూ.10వేలు చెల్లించాడు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు లెక్కలు వేసి, మిగిలిన సొమ్ములను డీడీ రూపంలో తీసుకున్నారు. అయితే అతని ప్లాటుకు రెండు రహదారులు ఉన్నాయని, రెండు అగ్రిమెంట్లు ఇవ్వాలని, ఒక్కటే ఇవ్వటంతో దరఖాస్తును తిరస్కరించామని చెప్పారు. ఇప్పుడు ఇస్తామంటే మార్చితో గడువు ముగిసిందని చెబుతున్నారు. మరి తనకు ఇంతవరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగితే సమాధానం చెప్పటంలేదు. ఉన్న సొమ్ములు వదిలించుకొని, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి, క్రమబదీఽ్ధకరణ ధ్రువపత్రం రాక, దిక్కుతోచని పరిస్థితుల్లో పాత ఎల్‌ఆర్‌ఎస్‌ ధరఖాస్తుదారులు వాపోతున్నారు.


కమిషనర్‌ హామీ ఇచ్చినా..

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల సమస్య విషయమై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో కథనాలు ప్రచురించటంతో కమిషనర్‌ స్పందించారు. గతంలో ఏవైనా డాక్యుమెంట్లు జతపరచలేదన్న కారణంతో దరఖాస్తులు తిరస్కరణకు గురైతే.. సదరు డాక్యుమెంట్లు ఇస్తే క్రమబద్ధీకరణకు అవకాశమిస్తామని ప్రకటించారు. కానీ కమిషనర్‌ హామీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం డాక్యుమెంట్లు ఇస్తామన్నా, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తీసుకోవటం లేదు. పైగా మళ్లీ ధరఖాస్తు చేసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఫలితంగా వందలాది మంది పాత ధరఖాస్తుదారులు రూ.లక్షలు నష్టపోవడమే కాదు.. మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం పరుగు తీస్తూ.. రూ.లక్షలు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-10-07T05:38:31+05:30 IST