యాసంగిలో నీరు పారేదెలా..?

ABN , First Publish Date - 2020-11-21T06:55:36+05:30 IST

మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీరు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో వరిసాగుకు కాల్వల...

యాసంగిలో నీరు పారేదెలా..?

అధ్వానంగా వైరా రిజర్వాయర్‌ కాల్వలు

మరమ్మతులకు నిధులివ్వని  ప్రభుత్వం


వైరా, నవంబరు 20: మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీరు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో వరిసాగుకు కాల్వల ద్వారా నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందా అని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుడి, ఎడమకాల్వల గట్లు అనేకచోట్ల గండ్లు పడ్డాయి. మరికొన్ని చోట్ల అత్యంత బలహీనంగా ఉన్నాయి. వానాకాలం సీజన్‌లోనే కాల్వల ద్వారా నీటి సరఫరా వర్షాలు అధికంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరిగింది. అయితే యాసంగిలో వరి, ఇతర పంటలు సాగుచేస్తే నీటి సరఫరా సాఫీగా జరగటం కష్టంగా ఉంటుందని రైతులు చెపుతున్నారు.


ఎండాకాలంలో సాగునీటి సమస్య తలెత్తే అవకాశముందని రైతులు అంటున్నారు. ఈ రెండు కాల్వల కింద రైతులు పూర్తిస్థాయిలో వరి, ఇతర పంటలు సాగుచేసినట్లయితే సాగర్‌జలాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. తాగునీటి అవసరాల నిమిత్తం మిషన్‌ భగీరథకు సంబంధించి రిజర్వాయర్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని నిల్వ చేయాల్సి ఉంది. అదనంగా ఉన్న నీటిని మాత్రమే పంటలకు సరఫరా చేయాల్సిన పరిస్థితి. తాగునీటి అవసరాలకుపోను సాగునీటికి కేవలం 4నుంచి 5అడుగుల నీటిని మాత్రమే వాడుకునే వీలుంది. అందువలన ఎప్పటికప్పుడు సాగర్‌జలాలతో రిజర్వాయర్‌ను నింపి ఇక్కడి నుంచి కుడి, ఎడమకాల్వల ద్వారా ఆయకట్టులోని సాగుకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సాగర్‌జలాలు రిజర్వాయర్‌కు సవ్యంగా రావడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 


తిమ్మారావుపేట సమీపంలో కాజ్‌వే నిర్మించాల్సి ఉంది

వైరా రిజర్వాయర్‌కు దాదాపు 25కిలోమీటర్ల దూరంలోని తిమ్మారావుపేట వద్ద ఎస్కేప్‌ లాకుల నుంచి సాగర్‌జలాలను సరఫరా చేయాల్సి ఉంది. ఎస్కేప్‌ లాకుల నుంచి విడుదల చేసిన సాగర్‌నీరు ఏటి ద్వారా వైరాకు చేరాల్సి ఉంటుంది. ఈ మధ్యలో తిమ్మారావుపేట, యర్రబోడుతండా సమీపంలో ఏటిపై కాజ్‌వే లేనందున ఆగ్రామాల రైతులు సాగర్‌జలాల విడుదలను అడ్డుకునే ప్రమాదముంది. గతంలో వరుసగా రెండేళ్లు వైరా ఆయకట్టులో యాసంగి సాగుచేశా రు. ఆసమయంలో ఎస్కేప్‌ లాకుల నుంచి వైరాకు సాగర్‌జలాలు విడుదల చేసిన సమయంలో తిమ్మారావుపేట, యర్రబోడుతండా రైతులు ఆనీటి విడుదల పట్ల ఆందోళన చేశారు.


ఏట్లో నీరు ప్రవహిస్తుంటే తమ వ్యవసాయ పనులు ముందుకు సాగవని అందుకని సాగర్‌జలాలు విడుదల చేయటాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ కాజ్‌వే నిర్మాణం కోసం ఎమ్మెల్యే రాములునాయక్‌ పరిశీలించారు. రూ.30లక్షల నిధుల కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇంతవరకు కాజ్‌వే నిర్మాణం అతీగతీ లేదు. ఈ పరిస్థితుల్లో సాగర్‌జలాలు వైరాకు సవ్యంగా రావడానికి అనేక అవాంతరాలు ఉంటాయని రైతులు సందేహిస్తున్నారు.


నిధులు లేక మరమ్మతులు శూన్యం

మూడేళ్లుగా కుడి, ఎడమకాల్వల మరమ్మతులకు నిధులు లేకుండాపోయాయి. అధికారులు చేయించిన మరమ్మతులకు ఇంతవరకు సరిగా బిల్లులు కూడా చెల్లించలేదు. గతంలో సాగునీటి పన్ను వసూలు చేసిన సమయంలో ఆనిధులతో నీటి సంఘాల ద్వారా మరమ్మతులు చేయించేవారు. ప్రభుత్వం నీటితీరువా పన్ను రద్దుచేయటంతో ఎలాంటి నిధులు లేకుండాపోయాయి. ప్రభుత్వం కూడా మరమ్మతులకు పైసా నిధులివ్వటం లేదు.


ఈ ఏడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కుడి కాల్వ గట్లకు రెబ్బవరం, గొల్లపూడి, పాలడుగు వద్ద గండ్లు పడ్డాయి. పలుచోట్ల గట్లు కొట్టుకుపోయాయి. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి వానాకాలం సాగుకు అధికారు లు నీళ్లు ఇచ్చారు. ఈ యాసంగిలో కాల్వలు ఇలాగే ఉంటే నీళ్లు ప్రవహించే అవకాశం కన్పించటం లేదు. ఎడమకాల్వ లింగన్నపాలెం, గరికపాడు బ్రాంచ్‌ చానల్స్‌ పూడికతో నిండిపోయి ఆనవాలు కూడా లేకుండా ఉన్నాయి. అందువల్ల యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం కొన్నిలక్షలరూపాయలు కేటాయించి కాల్వలకు మరమ్మతులు చేయించాలని అలాగే తిమ్మారావుపేట, యర్రబోడుతండా వద్ద కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు కోరుతున్నారు.

Read more