భయం కాదు.. అప్రమత్తత అవసరం

ABN , First Publish Date - 2020-08-01T10:53:13+05:30 IST

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత అందరిపై ఉంది

భయం కాదు.. అప్రమత్తత అవసరం

రూ.వెయ్యితో నయమయ్యేది కరోనా

ప్రైవేటుకెళ్లి రూ.లక్షలు ఖర్చుచేస్తున్నారు

81శాతం మందికి తెలియకుండానే వచ్చిపోతుంది

ఆరోగ్య రంగంలో మూడోస్థానంలో రాష్ట్రం 

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

ఖమ్మంలో పర్యటన.. జిల్లా వైద్య శాఖ తీరుపై సమీక్ష 


ఖమ్మం, జులై 31 (ఆంధ్రజ్యోతి): ‘కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత అందరిపై ఉంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదమే. నూటికి 81 శాతం మందికి లక్షణాలు లేకుండానే, వచ్చినట్టు తెలియకుండానే కరోనా వచ్చి పోతోంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్‌-19 ట్రూనాట్‌, కరోనా నిర్ధారణ కేంద్రాన్ని, కార్డియాలజిస్ట్‌, యూరాలజిస్ట్‌ విభాగంలో 20 ఐసీయూ బెడ్ల వార్డులను, ఆ తర్వాత మమత ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ ద్వారా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు, ఇతరులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అందుతున్న కరోనా, ఇతర దీర్ఘ కాలిక వ్యాధుల వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మరణాల శాతం అధికంగా నమోదైన మెర్స్‌, ఎబోలా లాంటి వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు, ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.


కేరళ, తమిళనాడు తర్వాత ఆరోగ్య రంగంలో అతి తక్కువ కాలంలో మూడోస్థానం దక్కించుకున్న ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. పాత సంస్కృతి, పాత పద్ధతుల వల్ల అక్కడక్కడ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని, ప్రస్తుతం ప్రభుత్వ వైద్యం చాలా మెరుగుపడిందన్నారు. ప్రజలను భయపెట్టొద్దని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు ధైర్యం కల్పించడంతోపాటుగా వారికి మంచి ఆరోగ్యవసతి కల్పించడమేనన్నారు. 14 శాతం మందికి కరోనా లక్షణాలుంటాయని వారికి వెంటిలేటర్లు అవసరం లేకుండానే ఆక్సిజన్‌ సపోర్ట్‌తో తగ్గిపోతుందన్నారు. మిగిలిన 5 శాతంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉన్నవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటారని, వాఉ అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా ప్రబలే ప్రస్తుత సమయంలో ఆశా వర్కర్‌ నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.


ప్రతి ఆశావర్కర్‌ రోజూ 40నుంచి 50 ఇళ్లవరకు సర్వే చేసి ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి పంపాలన్నారు. ఐసోలేషన్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమనీని, వెంటిలేటర్‌ మానిటర్లు కూడా నర్సింగ్‌ స్టాఫ్‌కు కనిపించేలా బయట ఏర్పాటు చేసుకోవడం ద్వారా రోగుల పరిస్థితులను గమనించవచ్చన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రైవేటు వైద్యం కంటే కూడా ప్రభుత్వం ఆసుపత్రులను బాగా నడుపుతూ ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. రూ.వెయ్యి ఖర్చుతో నయమయ్యే కరోనాకు భయంతో ప్రైవేటుకు వెళ్లి రూ.లక్షలు ఫీజులు చెల్లిస్తున్నారని, అయినా ప్రాణాలు నిలబడట్లేదన్నారు. ప్రభుత్వ ఐసోలేషన్‌లో ఉన్నవారికి సరైన సమయానికి భోజనం అందట్లేదు అన్న పరిస్థితి తీసుకురావద్దన్నారు. ఎక్కడా డాక్టర్లు, సిబ్బంది కొరత లేదని ఒకవేళ ఎక్కడైనా ఉంటే అక్కడ ఉంటే అక్కడ స్టాఫ్‌ని రిక్రూట్‌ చేసుకునే అవకాశాన్ని స్థానిక మంత్రి, కలెక్టర్‌కు కల్పించేలా సర్కులర్‌ జారీచేశామన్నారు. 


300మందికి పైగా ఖమ్మంలోనే అత్యవసర వైద్యం : మంత్రి పువ్వాడ 

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు మమత జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ -19 వ్యాధి నిర్ధారణ కేంద్రాల ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్‌ నిర్ధారణ పరీక్షలు, మమత ఆసుపత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా పరీక్షలు అందుబాటులోకి తేవడం ద్వారా 300 మందికి పైగా అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే సామర్ధ్యం ఉందన్నారు.


సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌, ‘సుడా’ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, గ్రంథాలయ చైర్మన్‌ ఖమర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు రమేష్‌రెడ్డి, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి సైదులు, డీఎస్‌వో డాక్టర్‌ కోటిరత్నం, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు, ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులు, నగర కార్పోరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మమత ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ ద్వారా నిర్థారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు మంత్ర ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేశారు. ఇదే క్రమంలో ఈటలను పలు సంఘాల నేతలు కలిసి తమ వినతులు అందజేశారు.

Updated Date - 2020-08-01T10:53:13+05:30 IST