‘రియల్‌’ అక్రమం

ABN , First Publish Date - 2020-03-12T06:51:52+05:30 IST

ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మండలంలో రియల్‌ ఎస్టేట్‌ దందాను నడిపే అక్రమార్కుల అక్రమాలు

‘రియల్‌’ అక్రమం

సింగరేణి నిర్వాసితురాలి భూమికి ఎసరు 

ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ స్వాధీనం 

ఆక్రమించి ప్లాట్లు చేశారని బాధితురాలి ఆరోపణ 

న్యాయం చేయాలని వేడుకోలు


మణుగూరు రూరల్‌, మార్చి 11: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మండలంలో రియల్‌ ఎస్టేట్‌ దందాను నడిపే అక్రమార్కుల అక్రమాలు పెరిగిపోతున్నాయి. వీరి అక్రమాలకు ఎందరో గిరిజనులు అన్యాయమైపోగా.. గిరిజనేతురులుకూడా మోసపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రియల్‌ మాఫియా అక్రమాలకు తాజాగా మరో సింగరేణి గిరిజన నిర్వాసితురాలు బాధితురాలుగా మారింది. నిర్వాసిత గిరిజన మహిళకు నష్టపరిహారం కింద ఇచ్చిన రెండెకరాల భూమికి రియల్‌ వ్యాపారులు ఎసరుపెట్టగా జరుగుతున్న అన్యాయంపై గిరిజన మహిళ స్పందించి అడ్డుతగిలింది. దాంతో రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు సదరు రియల్‌ వ్యాపారి పన్నాగం పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళ రెవెన్యూ అధికారులను కలసి న్యాయం చేయాలని కోరగా అది ప్రభుత్వ భూమి అని, అందువల్ల ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెబుతుండడం గమనార్హం. 

 

నిర్వాసితురాలి భూమిలో అక్రమ వెంచర్‌ 

మణుగూరు ఏరియాలోని కొండాపురం పాంతంలోని సింగరేణి గనుల్లో కాటిబోయిన చుక్కమ్మ అనే గిరిజన మహిళ తన భూమిని కోల్పోయింది. నష్టపరిహారం కింద చుక్కమ్మకు 2003లో మణుగూరు రెవెన్యూలోని ఉడతానేనిగుంపు గ్రామ సమీపంలోని 138/57సర్వే నెంబర్‌లో రెండెకరాల భూమిని కేటాయించారు. పట్టాను కూడా బాధితురాలి పేరుమిద ఇవ్వగా నాటినుంచి బాధితురాలు సాగు చేస్తుండడంతోపాటు రైతుబంధు పధకం కింద ప్రభుత్వం ఇచ్చే సాగు సాయాన్ని అందుకుంటోంది.   అయితే ఈ భూమిపై ఓ మాజీ రెవెన్యూ ఉద్యోగితోపాటు మరికొందరి కన్ను పడింది. ఆ భూమిని ఆక్రమించి పాట్లుగా మార్చి రహదారుల ఏర్పాటుకు గ్రావెల్‌ను తరలించారు. సమాచారం తెలిసిన రెవెన్యూ సిబ్బంది 2019 డిసెంబర్‌ 4న సదరు భూమిని పరిశీలించి ప్రభుత్వ భూమిగా గుర్తించి సాధీనం చేసుకున్నారు.


సంబంధిత భూమి తాలుకు ఎవరైనా ఉంటే వారికి నోటీసులిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించిన బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో తన భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేసింది. రెవెన్యూ అధికారులకు కూడా విషయం తెలయబరుస్తూ న్యాయం చేయాలని దరఖాస్తు చేసింది. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో 2019డిసెంబర్‌ 30న భద్రాచలం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. అయినా స్థానిక సిబ్బంది స్పందించకపోగా అది ప్రభుత్వభూమి అని చెబుతున్నారని బాధిత మహిళ వాపోయింది. కనీసం తమకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే రెండురోజుల క్రితం స్వాధీనం చేసుకుంటున్నట్లు భూమిలో పెగ్‌మార్క్‌లు వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మాట్లాడేందుకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆసక్తి చూపడంలేదంటూ ఆరోపించింది.


ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నాం: ఆర్‌ఐ కీర్తి  

ఈ విషయమై మణుగూరు రెవెన్యూ ఆర్‌ఐ కీర్తిని వివరణ కోరగా అది ప్రభుత్వ భూమి అని, అందులో అనుమతిలేకుండా ప్లాట్లు వేయగా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.స్వాధీనం చేసుకున్న భూమిని మునిసిపాలిటీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-12T06:51:52+05:30 IST