ఖమ్మంలో వాహనాలు సీజ్
ABN , First Publish Date - 2020-03-24T12:28:49+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు ఎవరు బయటకు రాకూడదంటూ లాక్‌డౌన్

లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన జనం
తనిఖీలు నిర్వహించిన పోలీసు, రవాణా అధికారులు
ఖమ్మంక్రైం/ఖమ్మంకమాన్‌బజార్, మార్చి 23 : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు ఎవరు బయటకు రాకూడదంటూ లాక్‌డౌన్ ప్రకటించినప్పటికి సోమవారం రాత్రి పలువురువాహనదారులు రోడ్లపైకి వచ్చారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు ప్రచారం చేసినా కొందరు వాహనదారులు పట్టించుకోలేదు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లల పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. సీపీ తప్సీర్‌ఇక్బాల్, ఏడీసీపీలు మురళీధర్, ఇంజారపు పూజ.. తొలుత ఖమ్మం బస్టాండ్ సెంటర్ వద్ద వాహన తనిఖీల్లో పాల్గొని.. వాహనదారులకు లాక్‌డౌన్ నిబంధనలు వివరించారు.
నిబంధనలు పాటించని వారి వాహనాలను స్వాధీనం చేసుకుని లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఇస్తామని హెచ్చరించారు. అనంతరం సుమారు వందకుపైగా ద్విచక్రవాహనాలను, సుమారు 20కార్లను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో ఏసీపీలు రామోజీరమేష్, గణేష్, సీఐలు వెంకన్నబాబు, తుమ్మ గోపి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే రవాణాశాఖ అధికారులు కూడా సోమవారం ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన 15వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీటీవో రవీందర్ పలువురు వాహనదారులకు లాక్‌డౌన్‌పై సూచనలు చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో ఏఎంవీఐ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.