వరిగడ్డి కట్టలు మీదపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-07T04:39:07+05:30 IST

ఖమ్మంజిల్లా వైరా మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో వరిగడ్డివామి కట్టలు మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఇది. వారంరోజుల తర్వాత ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వరిగడ్డి కట్టలు మీదపడి వ్యక్తి మృతి

ఆలస్యంగా వెలుగులోకి

వైరా, డిసెంబరు 6: ఖమ్మంజిల్లా వైరా మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో వరిగడ్డివామి కట్టలు మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఇది. వారంరోజుల తర్వాత ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తోటకూర వెంకటగోపాలరావు అలియాస్‌ శ్రీనివాసరావు(45)వరిగడ్డి కట్టల కింద పడి మృతిచెందాడు. ఆదివారం పరధాపట్టా పైన వరిగడ్డి కట్టల కింద కుళ్లిపోయి ఉన్న వెంకటగోపాలరావు మృతదేహం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 30న వెంకటగోపాలరావు తమ ఇంటి వెనుకాల భాగంలోని దొడ్డిలో ఉన్న వామి నుంచి వరిగడ్డి కట్టలు తీసుకురావడానికి వెళ్లాడు. వర్షానికి తడవకుండా వామిపైన కప్పిఉన్న పరధాపట్టా వేలాడుతుండటంతో దాని కిందకు దూరి వరిగడ్డి కట్టలు తెచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో పరధాపట్టా ఆపైన వరిగడ్డి కట్టలు మీదపడ్డాయి. ఆసమయంలో ఎవరూ చూడలేదు. కొద్దిగా మందమతి ఉన్న మృతుడు తరచూ హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. ఈనెల మొదటి వారం నుంచి భర్త ఆచూకీ కోసం భార్య బంధువులను వాకబు చేస్తుంది. అయినప్పటికీ ఫలితం లేదు. చివరికి ఆదివారం వరిధాన్యం ఆరబోసేందుకుగానూ వామిపై ఉన్న పరధాపట్టా కోసం ట్రాక్టర్‌ డ్రైవర్‌ జోజి అక్కడకు వెళ్లగా దుర్వాసన వెదజల్లుతుండటంతో మృతుడి కుటుంబసభ్యులకు తెలిపాడు. ఆతర్వాత పడిపోయి ఉన్న వరికట్టలు, పరధాపట్టాను తొలగించగా వెంకటగోపాలరావు మృతదేహం కుళ్లిపోయి కన్పించింది. దాంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


Updated Date - 2020-12-07T04:39:07+05:30 IST