వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-11T04:53:42+05:30 IST
వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటు న్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు.

చంద్రుగొండ, డిసెంబరు 10: వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటు న్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు. గురువారం చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని కనిగిరి గుట్టలను కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ పివీ రాజారావు, జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్‌రంజీత్‌నాయక్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి ఎ.అప్పయ్య పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది అటవీ ప్రాంతంలో నిర్మించిన చెరువును ప్రతాపరుద్రగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. కనిగిరి గుట్టల్లో కాకతీయుల నాటి కట్టడాలు వాటి ఆనవాళ్లు ప్రస్తుతానికి చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. నూతనంగా నిర్మించిన ప్రతాపరుద్ర చెరువు హస్తాల వీరన్న గుడికి తూర్పు భాగాన 500 మీటర్ల దూరంలో ఉందన్నారు. దీని పక్కన 20 హెక్టార్‌లలో మైదానం, వాచ్ టవర్‌ను నిర్మిస్తామన్నారు. అడవిలో అవసరం, అవకాశం ఉన్నం త వరకు జంతువులు, పక్షుల కోసం నీటి గుంటలు, చెరువులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చంద్రుగొండ ఫారెస్ట్ రేంజర్ సీహెచ్.శ్రీనివాసరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు రాములు, రామారావు, నాగరాజు పాల్గొన్నారు.