‘ఫలితం’ కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2020-06-23T10:25:54+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం కూడా ఇరుజిల్లాల్లో ఒక్కో కేసు

‘ఫలితం’ కోసం నిరీక్షణ

కరోనా రిపోర్టు వచ్చేందుకు రెండు రోజుల సమయం

హైదరాబాద్‌, వరంగల్‌ ల్యాబ్‌లకు ఉమ్మడి జిల్లా శాంపిళ్లు

మంజూరైనా ప్రారంభకాని ‘కోవిడ్‌’ పరీక్షా కేంద్రం 

ప్రారంభిస్తే సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకూ ప్రయోజనం

ఇరు జిల్లాల్లో విస్తరిస్తున్న వైరస్‌


ఖమ్మం/కొత్తగూడెం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం కూడా ఇరుజిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో వైరస్‌ నిర్ధారణకు కనీసం రెండురోజులు సమయం పడుతోంది. అనుమానితులనుంచి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌ లేదా వరంగల్‌కు పంపాల్సి ఉంది. రోజూ సాయంత్రం సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపిన తర్వాత 24లేదా 48గంటల తర్వాత ఫలితాలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతం అధికంగా ఉండగా దీనికి తోడు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.


ఖమ్మం కేంద్రంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ట్రూనాట్‌ మిషన్‌ను మంజూరుచేసింది. దీని ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు ఒకే రోజులో చేసే అవకాశం ఉంది. మొదట ఖమ్మం కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా ఏజెన్సీ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే జిల్లాకు కరోనా వైరస్‌ నిర్ధారణ కేంద్రం మంజూరై నెలరోజులు దాటినా ఇంతవరకు ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 40 పాజిటివ్‌ కేసులు నమోదవగా వారిలో 26మంది కోలుకున్నారు.


13మంది చికిత్స పొందుతుండగా ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లానుంచి ప్రతీరోజూ పదినుంచి 50శాంపిల్స్‌  హైదరాబాదు, వరంగల్‌కు పంపిస్తున్నారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లా కేంద్రం వైద్యానికి కేంద్రంగా ఉండడంతో సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సూర్యాపేట, మహబూబాద్‌ తదితర జిలాల్లనుంచి కూడా ఖమ్మం ఆసుపత్రులకు ప్రజలు భారీ సంఖ్యలో వైద్య సేవలకోసం వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్‌ నిర్ధారణ కేంద్రం ఖమ్మం లేదా కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తే ఫలితాలు ఏరోజుకారోజుల అందించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కరోనా వైరస్‌ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల కేసులకు సంబంధించిన పరీక్షలు కూడా వేగంగా పూర్తి చేసే అవకాశముంటుంది.  


విస్తరిస్తున్న మహమ్మారి..

తొలివిడత కేసుల తరువాత లాక్‌డౌన్‌ సడలింపులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌కు ముందు నాలుగు కేసులు నమోదుకాగా వారంతా కోలుకున్నారు. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉండగా.. ప్రస్తుతం మళ్లీ జిల్లాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సింగరేణిలో ఇద్దరు  కార్మికులకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కేవలం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనే కరోనా కేసులు నమోదుకాగా ప్రస్తుతం పాల్వంచ, మణుగూరు, బూర్గంపాడు లాంటి ప్రాంతాల్లోనూ నమోదుకావడంతో వైరస్‌ వ్యాప్తి పట్ల ఆందోళన కనిపిస్తోంది.


దీనికి తోడు ఇటీవల ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జిల్లాలో పర్యటించడం, ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసు, మీడియా వర్గాల్లోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రులో జలుబు, జ్వరం, తుమ్ములు, ఒళ్లు నొప్పులతో చికిత్సకు వచ్చిన వారి వివరాలను జిల్లా వైద్యశాఖకు అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రద్దీ ప్రాంతాలకు  వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు.  


Updated Date - 2020-06-23T10:25:54+05:30 IST