నిత్యావసరాల రవాణా

ABN , First Publish Date - 2020-03-28T11:33:34+05:30 IST

నిత్యావసర వస్తువుల రవాణా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

నిత్యావసరాల రవాణా

సమస్యను పరిష్కరిస్తాం

హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైల్‌ వ్యాపారం చేయొద్దు

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం కార్పొరేషన్‌, మార్చి 27: నిత్యావసర వస్తువుల రవాణా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలసి మంగళవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. వైరారోడ్‌లోని మోర్‌సూపర్‌ మార్కెట్‌, గాంధీచౌక్‌లోని హోల్‌సేల్‌ కిరాణా షాపులు, గాంఽధీనగర్‌లోని కూరగాయల మార్కెట్లను మంత్రి పరిశీలించారు.


ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల నిల్వ గురించి హోల్‌సేల్‌ కిరాణదుకాణదారులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  తమ వద్ద ఉన్న నిల్వలు రెండు, మూడురోజుల్లో అయిపోతాయని సరుకుల రవాణా లేదని, వ్యాపారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పప్పు, ఆయిల్‌, పంచదార రవాణాలో ఏర్పడిన సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని కలెక్టర్‌ కర్ణన్‌కు మంత్రి సూచించారు. లోడ్‌ దించే కూలీలకు వ్యాపారస్తులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, దీనివల్ల పోలీసులతో సమస్య ఉండదన్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటైల్‌ వ్యాపారం చేయొద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు.


కాగా హోల్‌సేల్‌ షాపుల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుందని, రిటైల్‌ వ్యాపారులకు అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఆయా వ్యాపారులు మంత్రిని కోరారు. లాక్‌డౌన్‌ను ప్రజలు అర్థం చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. ప్రజలు స్వీయా నిర్బంధాన్ని పాటించాల న్నారు. రహదారులపై వస్తున్న వారిని కలెక్టర్‌ ఆపి వారి ఇళ్లకు పంపించారు. మంత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా పర్యటించారు.  కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌రావు, ఆర్‌డీవో ఎంవీ రవీంద్రనాథ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T11:33:34+05:30 IST