నేడు బంద్‌కు మావోయిస్టుల పిలుపు

ABN , First Publish Date - 2020-09-06T10:26:07+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

నేడు బంద్‌కు మావోయిస్టుల పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలో హై అలర్ట్‌ 


కొత్తగూడెం, సెప్టెంబరు 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ సంఘటనకు నిరసనగా మావోయిస్టులు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మావోయిస్టు పార్టీ ప్రతినిధులు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు శనివారం ఒక లేఖను కూడా విడుదల చేశారు. దీంతో జిల్లాలోని గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, పినపాక, కరకగూడెం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌లతోపాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు ఒక లేఖను కూడా విడుదల చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఆదివాసీ ముద్దుబిడ్డను గుర్తుతెలియని మావోయిస్టు పేరుతో పట్టుకొని జిల్లాలోని దేవళ్లగూడెం సమీపంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసి హత్యచేశారని, ఈ లేఖలో ఆరోపించారు.


ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆదివారం చర్ల శబరి ఏరియా బంద్‌కు కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద ప్రకటించారు. దీంతోపాటుగా ఇల్లెందు, నర్సంపేట ఏరియా మావోయిస్టు కార్యదర్శి శాంత పేరు మీద కూడా నేటి బంద్‌ను విజయవంతం చేయాలని మరో లేఖను విడుదల చేశారు. దీంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు జిల్లాలైన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి జిల్లాల్లో సైతం బంద్‌ చేపట్టాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కార్యదర్శి వెంకటేష్‌ ప్రకటన విడుదల చేశారు.


వారు ఆ ప్రకటనలో మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ను పోలీసులు పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో పూర్తిస్థాయిలో బంద్‌ చేయాలని ప్రజాస్వామికవాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. తాజా పరిణామాలతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడేమీ జరుగుతుందోనని పోలీసులు ముందు జాగ్రత్తగా భారీగా బలగాలను అడవుల్లో మొహరించి కూంబింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గుడుపుతున్నారు.  

Updated Date - 2020-09-06T10:26:07+05:30 IST