అదిగో పులి.. ఇవిగో గుర్తులు.. పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

ABN , First Publish Date - 2020-12-11T04:57:09+05:30 IST

కొద్దిరోజులుగా పినపాక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను గడగడాలాడించిన పులి సంచారం సమాచారం గురువారం సింగరేణికి చేరింది.

అదిగో పులి.. ఇవిగో గుర్తులు.. పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు
పులి అడుగుజాడలను పరిశీలిస్తున్న అటశీశాఖ అధికారులు

మణుగూరు ఓసీ-2 ఏరియాలో వ్యాఘ్ర సంచారం 

ఆందోళనలో కేపీయూజీ గని కార్మికులు


మణుగూరుటౌన్‌, డిసెంబరు 10: కొద్దిరోజులుగా పినపాక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను గడగడాలాడించిన పులి సంచారం సమాచారం గురువారం సింగరేణికి చేరింది. సింగరేణి కాలసీర్‌ మణుగూరు ఏరియాలోని ఓసీ-2 గని ఏరియాలో పులి సంచరించిందన్న సమాచారం ఏరియాలో అలజడి రేపింది. ఓ ప్రైవే టు సెక్యూరిటీగార్డు పులి నీరుతాగుతుంటే చూశానని చెప్పడంతో అది గురువారం దావానంలా వ్యాపించింది. దీంతో అటవీశాఖ అధికారులు, సింగరేణి అధికారులు పులి సంచారించిందన్న ప్రాంతానికి వెళ్లి ఆనవాళ్లను పరిశీలించారు. ఓసీ-2 గనిలో పులి సంచరించినట్లుగా దాని అడుగులను గుర్తించారు. దీంతో రాత్రిపూట విధులకు హజరయ్యే కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి: ఎఫ్‌డీవో

ఓసీ-2 గని ప్రాంతంలో గురువారం పులి అడుగులను గుర్తించామని, ప్రజలు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని మణుగూరు ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్‌ఆర్‌వో ప్రసాదరావు అన్నారు. గురువారం ఓసీ-2 గని ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లను, అడుగులను గుర్తించిన అనంతరం వారు మాట్లాడారు. పెద్దపెద్ద శబ్దాలకు పులులు సర్వసాధారణంగా బయటకు రావనిచ కానీ కొద్దిరోజులు సంచరిస్తున్న పులి లారీల శబ్దాలను లెక్క చేయకుండా సుమారు ఎనిమిది పర్యాయాలు ప్రధాన రహదారులను దాటినట్లుగా తెలుస్తోందన్నారు. ఓసీ గనుల్లో ఉండే భారీ యంత్రాల శబ్దాలను లెక్క చేయకుండా గని ప్రాంతంలోకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ప్రజలు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులికి హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

ఆందోళనలో కేపీయూజీ గని కార్మికులు

పులి సంచరిస్తోందన్న సమాచారంతో కేపీయూజీ గని కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కేపీయూజీ పంచ్‌ ఎంట్రీ గనికి వెళ్లే దారిలో నామమాత్రం విద్యుత్‌ దీపాలుంటాయని, కంటిన్యూయస్‌ మైనర్స్‌ ప్రాజెక్ట్‌, పంచ్‌ఎంట్రీ గనికి వెళ్లే రహదారులు వీడిపోయే దగ్గర నుంచి రహదారిపై విద్యుత్‌ దీపాలు లేవని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఏరియా జీఎంను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్ర యత్నించగా అందుబాటులోకి రాలేదు. 


Updated Date - 2020-12-11T04:57:09+05:30 IST