అనంతారం అడవుల్లో పెద్దపులి
ABN , First Publish Date - 2020-12-31T05:27:17+05:30 IST
కరకగూడెం మండలంలోని అనంతారం అడవులలో పెద్దపులి సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు

భయంతో పరుగులు తీసిన రైతులు
కరకగూడెం, డిసెంబరు 30: కరకగూడెం మండలంలోని అనంతారం అడవులలో పెద్దపులి సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అనంతారం గ్రామానికి చెందిన బంటు మహేష్, ఆశోక్ అనే ఇద్దరు రైతులు బుధవారం తమ పత్తి చేనుకు వెళుతుండగా అనంతారం, మోగిలితోగు అడవి ప్రాంతంలోని బత్తిని వెంకన్న కుంట పరిధిలోని అడవీ బాట వద్ద పెద్దపులి కనిపించడంతో భయంతో పరుగులుతీశారు. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు పులి ఆనావాళ్ల కోసం గ్రామస్థుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నవంబరు 20 వ తేదిన అనంతారం, దేమరతోగు అడవీ ప్రాంతంలో పులి ఆరుపులు వినిపించాయని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులు తెలపడంతో..మణుగూరు, గుండాల, తాడ్వాయి అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి ఆనవాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. మరల ఇప్పుడు అనంతారం అడవులలో పులి సంచరిస్తున్నట్లు సమాచారంతో మండలంలోని మోగిలితోగు, అనంతారం, కొత్తూరు, తుమ్మలగూడెం, గొడుగుబండ, అశ్వాపురంపాడు గ్రామాలతో పాటు గుండాల మం డలం దేమరతోగు గ్రామాస్థులు బిక్కుబిక్కు మంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుందోనని ఆందోళన చెందుతున్నారు.
గాలింపు చర్యలు చేపడుతున్నాం
వెంకటేశ్వర్లు, రేంజర్
అనంతారం అడవిలో పులి కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. వెంటనే అధికారులతో గాలింపు చర్యలు చేపట్టాం. ఆనవాళ్లు ఇంకా కనిపించలేదు. రేపు కూడా ఆనవాళ్ల కోసం గాలింపుచేస్తాం. ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దు.
భయంతో పరుగులు తీశాం
బంటు మహేష్, అనంతారం గ్రామస్థుడు
పత్తిచేను పని కోసం నేను, మా గ్రామానికి చెందిన అశోక్ ఇద్దరం వెళ్తున్నాం. బత్తిని కుంట దగ్గరలోని కాలిబటలో పెద్దపులి కనిపించింది. దాన్ని చూసి భయంతో పరగులు తీశాం. భయంతో పరుగులు తీస్తుండగా కాలుకు గాయం అయింది.