ఆ వెలుగులు ఇక చరిత్రే !

ABN , First Publish Date - 2020-03-30T11:13:51+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లోని పాతప్లాంటు రెండు రోజుల్లో చరిత్ర గతిలో

ఆ వెలుగులు ఇక చరిత్రే !

రేపే కేటీపీఎస్‌ పాతప్లాంట్‌ మూసివేత

నిర్వేదంలో కార్మిక, ఉద్యోగ కుటుంబాలు

అత్యధిక కాలం పనిచేసిన ఇంజనీర్లుగా లక్ష్మయ్య, సమ్మయ్య 

సూపర్‌ క్రిటికల్‌ కేంద్రంగా ఏడోదశ

  

కేటీపీఎస్‌(పాల్వంచ), మార్చి 29: ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లోని పాతప్లాంటు రెండు రోజుల్లో చరిత్ర గతిలో కలిసి పోనుంది. 31వ తేదీన కర్మాగారంలోని అన్ని యూనిట్లను మూసి వేయాలని టీఎస్‌ జెన్‌కో నిర్ణయించిన నేపధ్యంలో కర్మాగార చరిత్ర కాలగర్భం లో కలిసిపోనుంది. ఎన్నో అవార్డులు, కొన్ని లక్షల కుటుంబాలకు వెలుగులు పంచిన ఈ కర్మాగారం ప్రారంభంలో 10వేల మంది కార్మికులు పనిచేశారు. కొన్ని వేల ఎకరాల్లో ఉన్న కేటీపీఎస్‌ ప్రాంగణం భవిష్యత్‌లో నిర్మానుష్యం కానుందనే భావనతో కార్మిక, ఉద్యోగ కుటుంబాలు నిర్వేదానికి గురి చేస్తోంది.


1966లో ప్రస్థానం ఆరంభం

కేటీపీఎస్‌ మొదటి దశను 1966-67సంవత్సరాల్లో 240మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.59.29లక్షలతో నిర్మించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మొదటి దశలోని  60మెగావాట్ల సామర్థ్యం కలిగిని ఏ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 720మెగావాట్ల  ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్‌లోని ఎనిమిది యూనిట్లలో ఆరు యూనిట్లను ఇప్పటికే మూసివదేశారు. కేటీపీఎస్‌ ఏడోదశ సీవోడీ అనంతరం అన్ని యూనిట్లను మూసివేస్తామని కేంద్ర పర్యావరణశాఖకు జెన్‌కో హామీ ఇచ్చిన నేపధ్యంలో వరుసగా యూనిట్లను మూసివేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 15న 60మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒకటో యూనిట్‌ను మూసివేశారు. ఇక మిగిలిఉన్న 5, 7యూనిట్లను 31వ తేదీన మూసివేయనున్నారు. దాంతో కేటీపీఎస్‌ పాత యూనిట్‌ చరిత్రలో కలిసిపోనుంది. 


టీఎస్‌ జెన్‌కో ఆధ్వర్యంలో..

2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ జెన్‌కో విడిపోయింది. ఈ సమయంలో 2013 ఆగస్టునుంచి 2016 జూన్‌వరకు లక్ష్మయ్య చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగారు. అనంతరం మంగేష్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పనిచేశాక ఆయనను కేటీపీపీకి బదిలీ చేయటంతో వీటీపీఎస్‌లో ఉన్న జాటోత్‌ సమ్మయ్య మరోసారి కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఆయనే తెలంగాణ తొలి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(800మెగావాట్లు) ఏడోదశ చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు.


ఏపీజెన్‌కోలో కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా 2009 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన బాధావత్‌ లక్ష్మయ్య2012 జూన్‌వరకు అంటే 30నెలలు, టీఎస్‌ జెన్‌కోలో 2014 జూన్‌ నుంచి 2016 జూన్‌ వరకు అంటే 24నెలల పాటు ఆయన పనిచేశారు. మొత్తంగా ఆయన 54నెలలు చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగారు. 2012 జులైలో కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన జాటోత్‌ సమ్మయ్య ఏడాది పనిచేసి వీటీపీఎస్‌కు బదిలీపై వెళ్లి మళ్లీ టీఎస్‌ జెన్‌కోలో 2017నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 30 నెలల పాటు చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగారు. సమ్మయ్య మొత్తంగా సుమారు 42 నెలల పాటు పనిచేయటం విశేషం. మార్చి31తో యూనిట్‌ను మూసివేస్తున్న క్రమంలో వీరి పదవీకాలం ఒక మైలురాయిగా నిలువనున్నది.  కేటీపీఎస్‌ ఏస్టేషన్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయగా తదనంతర కాలంలో స్వదేశీ పరిజ్ఞానంతో బీ, సీ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నాణ్యమైన విద్యుత్‌ ఉత్పత్తి సాధనలో కేటీపీఎస్‌ అనేక అవార్డులు సాధించింది.   


సూపర్‌ క్రిటికల్‌ కేంద్రంగా కేటీపీఎస్‌ ఏడోదశ

రూ.5290కోట్ల వ్యయంతో సూపర్‌ క్రిటికల్‌ విధానంతో కేటీపీఎస్‌ ఏడోదశ నిర్మాణం పూర్తిచేసుకుంది. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత నిర్మాణం జరిగిన తొలి కర్మాగారం కావటంతో సీఎం కేసీఆర్‌ వస్తారని రూ.30లక్షల వ్యయంతో అధికారులు భారీ పైలాన్‌ను నిర్మించారు. కానీ సీఎం కేసీఆర్‌ రాకపోవటంతో అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకటరావు నిర్మాణ పనులను ప్రారంభించారు. రికార్డుస్థాయిలో అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కేటీపీఎస్‌ ఏడో దశలో సాంకేతిక కారణాలతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయింది.

Updated Date - 2020-03-30T11:13:51+05:30 IST