‘మండలి’ పోరుపై పార్టీల దృష్టి

ABN , First Publish Date - 2020-09-16T06:50:37+05:30 IST

ప్రస్తుతం రాజకీయపార్టీలన్ని శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి

‘మండలి’ పోరుపై పార్టీల దృష్టి

గ్యాడ్యుయేట్‌ ఓటర్ల చేర్పునకు ప్రత్యేక కసరత్తు

ఇన్‌చార్జ్‌లను నియమించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశం


ఖమ్మం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ప్రస్తుతం రాజకీయపార్టీలన్ని శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం నల్గొండ, వరంగల్‌, ఖమ్మం  జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని పార్టీల శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా చేర్చేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఓటర్ల జాబితా చేర్పుల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నుంచి ఈ నెల 24న నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండగా.. మార్చిలో ఎన్నికలు జరుగుతాయని అధికార టీఆర్‌ఎస్‌త్‌ పాటు విపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో సుమారు 2.76లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. కానీ ఈ జాబితా పూర్తిగా రద్దవుతుంది. పాత వారితో పాటు 2017వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరుగా చేరే పట్టభద్రులు ఆన్‌లైన్‌లోకాని తహసీల్దార్‌కు నేరుగా గాని ఫారం 18ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డును జతపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ఓటుహక్కు అర్హత ఉన్న పట్టభద్రులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఎంతమందిని ఎక్కువగా చేరిస్తే.. వారికి అది కలిసొస్తుందని ఆశాభావంతో ఉన్నారు. 


టీఆర్‌ఎస్‌ నేతల ప్రత్యేక సమావేశం.. 

తమ పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్చేందుకు సమాయత్తం చేయాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నూకల నరేష్‌రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సమావేశమై గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారంపై చర్చించారు. ఓటర్ల చేర్పునకు గాను గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పాత ఓటర్లను రెన్యువల్‌ చేయడంతో పాటు కొత్త ఓటర్లను చేర్చాలని సూచించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పట్టభద్రుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 


రసవత్తరంగా పోరు..

ఇప్పటికే తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ఉమ్మడిఖమ్మంజిల్లాలో పర్యటించి కేడర్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. పట్టభద్రుల ఓట్ల చేర్పుపై దృష్టిసారించాలని కేడర్‌కు సూచించారు. ఇదిలా ఉంటే నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి కోదండరాం పోటీచేస్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. కోదండరాంతోపాటు యువతెలంగాణ పార్టీనుంచి జర్నలిస్టుగా పనిచేసిన రాణి రుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీనుంచి చెరుకు సుధాకర్‌, ఆమ్‌ ఆద్మీ తరపున రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, కవి బి.తిరుమలరావుతోపాటు మరికొందరు పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. మొత్తంమీద ఈసారి శాసనమండలి పట్టణభద్రుల పోరు రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. 

Updated Date - 2020-09-16T06:50:37+05:30 IST