అమ్ముతారా? ఉంచుతారా?

ABN , First Publish Date - 2020-03-16T12:48:56+05:30 IST

అమ్ముతారా? ఉంచుతారా?

అమ్ముతారా? ఉంచుతారా?

వేలం జాబితాలో లేని ఖమ్మం రాజీవ్‌స్వగృహ

అధికారుల నుంచీ రాని స్పష్టత

తమకు విక్రయించాలని ఇప్పటికే పలు సంఘాల వినతులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-ఖమ్మం): రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న పలు రాజీవ్‌ స్వగృహ సముదాయాలను ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులకు విడివిడిగా ప్లాట్ల వారీగా విక్రయించేందుకు బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను విక్రయించాలని భావిస్తోంది. ఇలా కట్టిన ఇళ్లు, ఖాళీస్థలాలను కూడా వేలంలో అమ్మి సొమ్ములు చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.


హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం, గాజులరామారం, షాపూర్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో కామారెడ్డి, కాగజ్‌నగర్‌, అదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లోని రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను, ఖాళీస్థలాలను అమ్మేందుకు ఉన్నత స్థాయికమిటీని కూడా నియమించింది. అయితే ఈ వేలం వేసే జాబితాలో ఖమ్మంలోని రాజీవ్‌ స్వగృహ సముదాయం లేకపోవడంతో ఈ ప్లాట్లను అమ్ముతారా? లేక అలాగే ఉంచుతారా? అన్నది  ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై జిల్లా అధికారులు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. 


ఎవరికీ పట్టని వైనం..

దశాబ్దకాలం తర్వాత రాజీవ్‌ స్వగృహ ప్లాట్లకు కదలిక వచ్చినా ఖమ్మం రాజీవ్‌ స్వగృహకు  మాత్రం మోక్షం లభించడంలేదు. దీంతో కోట్లాది రూపాయలు భవన సముదాయాలు నిరుపయోగంగా ఉండడంతోపాటు చెత్తా చెదారంతో అసంపూర్తిగా శిథిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఖమ్మం రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు వేలం పెడితే పలువురు ఆసక్తి చూపుతున్నా... జిల్లా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రాజీవ్‌స్వగృహ సమస్యను పట్టించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ సొమ్మే కదా మనకేంటి అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఖమ్మం రాజీవ్‌స్వగృహ ప్లాట్ల విషయం ఎటూ తేల్చలేకపోతురన్నారు. ఉద్యోగులు, అధికారులు, మధ్యతరగతి వర్గాలకు సైతం పక్కా ఇల్లు కల నెరవేర్చాలని దశాబ్దకాలం క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.60కోట్లతో ఖమ్మం జిల్లా పోలేపల్లిలో భవనాలు నిర్మించింది.


ఇవి పూర్తికాక ఎవరికీ కేటాయించక నిధుల దుబారా అయ్యే పరిస్థితి నెలకొంది. వీటిని నిర్మించి పూర్తిచేసి ఇస్తే తీసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ సంఘాల ద్వారా విన్నవించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. 2007లో పేద, మధ్యతరగతి వర్గాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు సైతం పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాజీవ్‌స్వగృహ, రాజీవ్‌గృహకల్ప పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా రాజీవ్‌ గృహకల్ప కింద నిరుపేదలకు మునిసిపల్‌ పట్టణాల్లో, కొన్నిచోట్ల సింగిల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇవ్వగా మధ్యతరగతి ఉద్యోగులకు మాత్రం రాజీవ్‌ స్వగృహ పేరుతో మునిసిపల్‌ పట్టణాల్లో దరఖాస్తులు స్వీకరించారు. 


అప్పట్లో వేలల్లో దరఖాస్తులు...

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏజెన్పీ ఏరియాలో ఉండడంతో ఖమ్మంలోనే అందరికీ అపార్టుమెంట్లతోపాటు వ్యక్తిగత ఇళ్లు నిర్మించి ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. వేలసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే కొందరు మాత్రమే రూ.3వేలు, 5వేల చొప్పున డిపాజిట్లు చెల్లించారు. ఆ తర్వాత పోలేపల్లిలో 16 ఎకరాల స్థలాన్ని అపార్టుమెంట్ల నిర్మాణానికి, రఘునాధపాలెం బైపాస్‌రోడ్డు సమీపంలో 100ఎకరాల స్థలం ఎంపికచేశారు. ముందుగా పోలేపల్లిలో 16ఎకరాల్లో రూ.60కోట్లతో త్రిబుల్‌బెడ్‌రూం 288, డబుల్‌బెడ్‌రూం 288 అపార్టుమెంట్‌ పనులకు శ్రీకారంచుట్టారు.


సింగిల్‌బెడ్‌రూం 288 అపార్టుమెంట్‌ పనులు ప్రారంభించలేదు. త్రిబుల్‌బెడ్‌రూం స్వ్కేర్‌ఫీట్‌ రూ.1480 చొప్పున 1450ఎస్‌ఎఫ్‌టీ ఉండేలా రూ.23.50లక్షలు డబుల్‌బెడ్‌రూంకు రూ.1445చొప్పున 1250ఎస్‌ఎఫ్‌టీపి రూ.18.50లక్షలు, సింగల్‌బెడ్‌రూం రూ12.50లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 8బ్లాకుల్లో డబుల్‌బెడ్‌రూం, త్రిబుల్‌బెడ్‌రూంప్లాట్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌ మోడల్‌లో భవనాలు నాణ్యతగా నిర్మాణాలు చేపట్టినా అప్పట్లో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో లబ్ధిదారులు ఎవరూ తమ వాటా సొమ్ము చెల్లించలేదు. ప్రైవేటుగా స్వ్కేర్‌ఫీట్‌ రూ.800నుంచి 1000వరకు ఉండటంతో రాజీవ్‌ స్వగృహ ధరలు అధికంగా ఉన్నాయని భావించి వాటిని తీసుకోవడానికి ఇష్ట పడలేదు. ప్రైవేటుగా పదేళ్లక్రితం ఖమ్మంలో రూ.10లక్షల నుంచి రూ.12లక్షలకే అపార్టుమెంట్‌ వచ్చే పరిస్థితి ఉండడంతో అంతా అటువైపే మొగ్గుచూపారు. క్రమంగా ధరలు పెరగడంతో డబుల్‌బెడ్‌రూంధర ప్రైవేటుగా రూ.20నుంచి 30లక్షలు పలుకుతుంది. దీంతో రాజీవ్‌ స్వగృహ ఇళ్లపై అందరి దృష్టిపడింది. 


తమకు విక్రయించాలని పలు సంఘాల విన్నపం..

ఖమ్మంలో నిరుపయోగంగా ఉంటున్న రాజీవ్‌స్వగృహ అపార్టుమెంట్లు, స్థలం తమకు కేటాయిస్తే డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టు సంఘాలు కూడా ప్రభుత్వానికి విన్నవించాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్‌స్వగృహ ప్లాట్లను విక్రయిస్తామని ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రకటించారు.


అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి కమిటీని నియమించి రాజీవ్‌స్వగృహకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఖమ్మం రాజీవ్‌స్వగృహపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ప్లాట్లను వేలంవేస్తే తీసుకొనేందుకు పలు సంస్థలు ఉద్యోగులు, సొసైటీలు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఆసక్తిగా ఉన్నారు. త్వరితగతిన రాజీవ్‌స్వగృహపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2020-03-16T12:48:56+05:30 IST