ఆరోగ్యమస్తు
ABN , First Publish Date - 2020-10-21T06:09:18+05:30 IST
భద్రాచలం కొత్తగూడె ం జిల్లా పరిధిలో రోగులకు ప్రభుత్వ వైద్యం మరింత దరిచేర్చే ప్రయత్నం ప్రారంభమైంది.

మన్యం ప్రజలకు మరింత చేరువలో వైద్యం
సబ్ సెంటర్ల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు
భద్రాద్రి సబ్ సెంటర్లకు విలీన కష్టాలు తీరేనా..
ఏజెన్సీకి 74 వెల్నెస్ సెంటర్లు మంజూరు
భద్రాచలం, అక్టోబరు 20: భద్రాచలం కొత్తగూడె ం జిల్లా పరిధిలో రోగులకు ప్రభుత్వ వైద్యం మరింత దరిచేర్చే ప్రయత్నం ప్రారంభమైంది. కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల కృషితో ఇందుకు బీజం పడింది. ఇప్పటికే భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్‌సెంటర్ల పునర్వ్యవస్థీకరణ కోసం వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ జి. శ్రీనివాసు సమీక్ష నిర్వహించారు. ఏ మండలంలో ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి?, ఎంత జనాభకు ఒక సబ్ సెంటరు ఉంది? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడువేల జనాభాకు ఒక సబ్ సెంటరును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 240 సబ్ సెంటర్లు ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో పలు సబ్ సెంటర్లలో ఆరువేల మందికి పైగా జనాభాకు సేవలందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సబ్ సెంటర్ల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేపట్టారు. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లో సైతం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి సబ్ సెంటర్లు ఎన్ని కావాలనే దానిపై ఆరా తీయనున్నారు. సబ్‌సెంటర్ల పునర్వ్యస్థీకరణ కోసం జిల్లాస్థాయిలో డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ కన్వీనరుగా ఎంసీహెచ్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ సుజాత కోకన్వీనరుగా తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
భద్రాద్రి సబ్ సెంటర్లకు విలీన కష్టాలు తీరేనా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మండలం నెల్లిపాక పీహెచ్సీ పరిధిలో ఉన్న భద్రాచలంలోని ఏడు సబ్ సెంటర్లకు విలీన కష్టాలు తీరడం లేదు. పోలవరం ముంపు మండలాల పేరుతో ఏడు మండలాలను ఏపీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. ఈ క్రమంలో నెల్లిపాక తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లడంతో దాని పరిధిలోని ఏడు సబ్ సెంటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భద్రాచలానికి పీహెచ్సీ కొత్తగా మంజూరు చేయాలని గతంలో ప్రతిపాదనలు పంపినా మంజూరు కాకపోవడంతో పాటు వైద్యాధికారి కూడా లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం పీహెచ్సీ వైద్యాధికారి భద్రాచలం సబ్ సెంటర్లను పర్యవేక్షిస్తున్నారు. వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నేటి వరకు స్పష్టత లేదు. కనీసం అర్బన్ హెల్త్ సెంటర్‌ను అయినా ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏజెన్సీకి 74 వెల్నెస్ సెంటర్లు మంజూరు
భద్రాచలం ఏజెన్సీకి 74 హెల్త్ వెల్నెస్ సెంటర్లు మంజూరైనట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల వెల్నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. తాజాగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి పీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలనే ప్రస్తావన, ప్రతిపాదనలు రావడంతో వెల్నెస్ సెంటర్లను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో వెల్నెస్ సెంటర్ల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవగాహన వైద్య సహాయం ఇతరత్రా సేవలు క్షేత్రస్థాయిలో అందిస్తారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.