టార్గెట్‌ కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2020-09-29T06:20:02+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ నగరపాలక సంస్థ

టార్గెట్‌ కార్పొరేషన్‌

నగరపాలక ఎన్నికలకు మరో ఆరునెలలే సమయం!

గెలుపే లక్ష్యంగా సమాయత్తమవుతున్న పార్టీలు

అభివృద్ధి మంత్రంగా అడుగులు వేస్తున్న అధికార పార్టీ

ప్రజాసమస్యలే ఎజెండా పయనిస్తున్న విపక్షాలు


ఖమ్మం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కార్పొరేషన్‌ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ నగరపాలక సంస్థ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. అభివృద్ధే ఎజెండాగా అధికార పక్షం అడుగులు వేస్తుంటే.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ పనితీరులోని లొసుగులే ఆయుధంగా విపక్షాలు కదులుతున్నాయి. గత ఎన్నికల్లో 50డివిజన్లలో 34డివిజన్లలో గులాబీ దళం విజయబావుటా ఎగురవేసి ఖమ్మంకార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలను పర్యవేక్షించగా.. ఈ సారి జరిగే ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు అప్పగించినట్టు సమాచారం. 


మళ్లీ గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ తహతహ..

గత ఎన్నికల తరహాలోనే రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఖమ్మం కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ తహతహలాడుతోంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రి అజయ్‌కుమార్‌ కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎన్నికలు మరో ఆరునెలలు ఉన్నందున వచ్చే డిసెంబరు నాటికి ఖమ్మంలో జరిగే అభివృద్ధి పనులు పూర్తిచేయించేలా కృషి చేస్తున్నారు. వచ్చే విజయదశమినాటికి రూ.25కోట్లతో నిర్మిస్తున్న ఐటీహబ్‌, రూ.17కోట్లతో నిర్మిస్తున్న కొత్తబస్టాండ్‌, రూ.14కోట్లతో నిర్మిస్తున్న కార్పొరేషన్‌ నూతన భవనం పనులు పూర్తిచేయించడంతోపాటు ఖమ్మంలో పేదలకు వెయ్యి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అందిచేలా చూస్తున్నారు. అలాగే వచ్చే డిసెంబరు నాటికి మరో వెయ్యి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతోపాటు రూ.70కోట్లతో గోళ్లపాడు ఛానల్‌ ఆధునీకరణ, 220కోట్లతో అమృత్‌ పథకం, మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు అందించే పనులు, రూ.75కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ, నగరంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, 115 ప్రజామరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా చేయిస్తున్నారు.


ఖమ్మం నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణతో పాటు వీధివ్యాపారాలకు సముదాయాల నిర్మాణం, ప్రజల అవసరాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే గత కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరగా కొన్ని పెండింగ్‌లో ఉండగా వాటిని పూర్తిచేయించి కార్పొరేషన్‌ ఎన్నికలకు వెళ్లేందుకు కార్పొరేషన్‌ పాలకవర్గంతో పాటు పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌, లకారం చెరువు ఆధునికీకరణ, సమీకృత వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌మార్కెట్‌ ప్రారంభించారు. కొత్తగా ఖానాపురం చెరువును కూడా ఆధునికీకరించి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అభివృద్ధి మంత్రంగా ఈసారి కూడా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 


విపక్షాలు ఎవరిదారిలో వారే..

ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న వామపక్షాలు, టీడీపీ ప్రస్తుతం ఎవరి దారిన వారు ప్రయాణిస్తున్నారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో జతకట్టగా, సీపీఎం, టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో, ఆతర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపినా విపక్షాల్లో మాత్రం ఐక్యతారాగం కనిపించడం లేదు. ప్రస్తుతం ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో గోళ్లపాడు నిర్వాసితులకు అండగా ఉద్యమం చేపట్టింది. అధికారుల చర్యలు అడ్డుకునేందుకు జాతీయ బీసీకమిషన్‌ సభ్యుడు ఆచారి ఖమ్మం వచ్చి సమావేశం నిర్వహించి.. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో గోళ్లపాడు నిర్వాసితులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఖమ్మంగోళ్లపాడు నిర్వాసితులను పరామర్శించి సమావేశం నిర్వహించారు. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్‌ కూడా అడపా దడపా ఆందోళనలు చేస్తోంది కానీ ఓ ప్రణాళిక అనేది కానరావడం లేదు. తనకున్న సంప్రదాయ ఓటుబ్యాంకుతో సత్తా చూపుతామన్న ధీమాతో నాయకులున్నారు. సీపీఎం, సీపీఐ, టీడీపీ ఎల్‌ఆర్‌ఎస్‌, ఇతర ప్రజాసమస్యలపై గళం వినిపిస్తున్నాయి.  


గత కార్పొరేషన్‌లో బలాబలాలిలా..

ఖమ్మంకార్పొరేషన్‌ ఏర్పడిన తర్వాత 2016మార్చి 9న ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి 6వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉంది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో నగరంలోని 50డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 34, కాంగ్రెస్‌ 10, సీపీఐ2, సీపీఎం2, వైసీపీ2 డివిజన్లు గెలుచుకున్నాయి. ఎన్నికల తదనంతర పరిణామాల్లో వైసీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ బలం 43కు పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. సుమారు 4.50లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్‌లో ప్రస్తుతం 2.80లక్షల మంది ఓటర్లున్నారు.


అయితే ఖమ్మంరూరల్‌ మండలంలో కార్పొరేషన్‌లో విలీనమైన నపంచాయతీలు మళ్లీ గ్రామపంచాయతీలుగా మార్పుచేసేందుకు కసరత్తు జరుగుతుండగా.. డివిజన్ల పునర్విభజన జరిగితే డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 1,80,551మంది ఓటర్లుండగా టీఆర్‌ఎస్‌కు 76,820, కాంగ్రెస్‌కు 37,210, వైసీపీకి 19,040, టీడీపీకి 15,292, సీపీఎంకు 13,4411, సీపీఐకి 8,668, బీజేపీకి 2,941, స్వతంత్రులకు 5,422, నోటాకు 1141 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2020-09-29T06:20:02+05:30 IST