సీఎంలను ప్రధాని బెదిరిస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-14T04:33:08+05:30 IST
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యుత్ చట్టానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే అదనపు అప్పులు తెచ్చుకునే అవకాశాలను రద్దు చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ.. అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బెదిరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

విద్యుత్ చట్టానికి సమ్మతించాలని ఒత్తిడి
కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌కే దన్ను
టీఆర్‌ఎస్ అసమర్థత వల్లే కాషాయ శక్తులు కాలుమోపుతున్నాయి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలు
భద్రాచలం, డిసెంబరు 13: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యుత్ చట్టానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే అదనపు అప్పులు తెచ్చుకునే అవకాశాలను రద్దు చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ.. అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బెదిరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. భద్రాచలంలో ఆదివారం జరిగిన భద్రాచలం డివిజన్ సీపీఎం నేత బండారు చందర్‌రావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అయితే తమకు అప్పు ఇవ్వకపోయినా పర్వాలేదని, విద్యుత్ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని వామపక్ష పాలనలో ఉన్న కేరళ ప్రభుత్వం తెగేసి చెప్పిన విషయాన్ని తమ్మినేని గుర్తు చేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేయరని ప్రశ్నించారు. కార్పొరేట్‌లకు వెన్నుదన్ను కోసమే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. నిన్నటి వరకు బీజేపీని పొగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్ దుబ్బాకలో ఓటమి, జీహెచ్‌ఎంసీలో సీట్లు భారీగా తగ్గడంతో ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక వైపు భారత్‌బంద్ సమయంలో నిరసనలు తెలిపి.. మరో వైపు దేశ ప్రధాని నరేంద్రమోదీని కలవడాన్ని చూస్తే.. పీఎంకు సీఎం కేసీఆర్ సరెండర్ అయ్యారన్న చర్చ జరుగుతోందన్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ అసమర్థత కారణంగానే ప్రజలు బీజేపీ వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. దేశ రాజధానిలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యమం అజరామరమైందని గత ఆరు దశాబ్దాల్లో ఇంతటి మహోన్నత ఉద్యమాన్ని చూడలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.