మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుల సరెండర్
ABN , First Publish Date - 2020-06-01T11:04:59+05:30 IST
మావోయిస్టు పార్టీలో గ్రామకమిటీ సభ్యులుగా పని చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను స్థానికులు
ఆరుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన గ్రామస్థులు
చర్ల, మే 31: మావోయిస్టు పార్టీలో గ్రామకమిటీ సభ్యులుగా పని చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను స్థానికులు ఆదివారం ఉదయం చర్ల పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ చేయించినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఆదివారం చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెళ్లడించారు. రెండు సంవత్సరాల క్రితం చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి వచ్చిన మావోయిస్టులు కొంత మంది గ్రామస్థులను తీవ్రంగా కొట్టగా, ఇర్పా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. కొంతమందిని బలవంతంగా గ్రామకమిటీల్లోకి తీసుకున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అందరూ కలిసి మావోయిస్టు పార్టీకి సహకరించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మావోయిస్టు పార్టీలో గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న కోరం నాగేశ్వరావు, కొమరం రమేష్, సోదెం రమేష్, కోరం సత్యం, ఇర్పావెంకటేశ్వర్లు, వాగే కన్నారావును గ్రామస్థులు సరెండర్ చేయించారని ఏఎస్పీ తెలిపారు. సుమారు 200 మంది గ్రామస్థులు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చర్ల సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.