సమ్మర్‌ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-14T11:30:35+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో జనాన్ని ఇళ్లకే పరిమితమవ్వని ప్రభుత్వం ఎంత చెప్పినా కొందరు అవసరం లేకపోయినా బయట

సమ్మర్‌ లాక్‌డౌన్‌

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండలు  

40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 

కాలుబయటపెట్టలేకపోతున్న ప్రజలు 

భద్రాద్రి జిల్లాలో వడ దెబ్బతో వృద్ధురాలి మృతి   


కొత్తగూడెం, ఏప్రిల్‌ 13: కరోనా లాక్‌డౌన్‌తో జనాన్ని ఇళ్లకే  పరిమితమవ్వని ప్రభుత్వం ఎంత చెప్పినా కొందరు అవసరం లేకపోయినా బయట తిరుగుతున్నారు. కానీ వారి దూకుడికి ఇక సూర్యుడు చెక్‌ పెట్టను న్నాడు. ఏప్రిల్‌ మాసం సగానికి రావడంతో ఎండలు ముదిరాయి. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో జనం కాలుబయటపెట్టాలంటే భయపడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో సోమవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో కరోనా లాక్‌డౌన్‌ కాస్తా వేసవి లాక్‌డౌన్‌గా మారిపోయింది.


ఒక పక్క కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుంటే మరోపక్క పెరుగు తున్న  ఉష్ణోగ్రతలు మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి.  లాక్‌డౌన్‌తో ఇప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. జనమంతా ఇళ్లకే పరిమితం కావడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేకమంది ఏసీలు,  కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగేవి కానీ ఈ సంవత్సరం అన్నీ మూసి ఉంచడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగని చెప్పవచ్చు.


ప్రస్తుతం మిర్చి కోతలకు వెళ్లే కూలీలు పెరుగుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం లక్ష్మీపురం గ్రామంలో సోమవారం వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెంది. మిర్చి కోతలకు వెళ్లిన ఆమె అస్వస్థతకు గురై మృతి చెందింది. 

Updated Date - 2020-04-14T11:30:35+05:30 IST