సజీవ చేపలకు మంచి డిమాండ్
ABN , First Publish Date - 2020-12-14T04:00:33+05:30 IST
సజీవ చేపలకు మంచి డిమాండ్

పాలేరు మత్స్య పరిశోధనాస్థానం
సీనియర్ సైంటిస్ట్ విద్యాసాగర్‌రెడ్డి
కూసుమంచి, డిసెంబరు 13: సజీవంగా ఉండే చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని పాలేరు మత్స్య పరిశోధనాస్థానం సీనియర్ సైంటిస్ట్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాకు చెందిన బీఎఫ్‌ఎస్‌సీ విద్యార్థులకు 90 రోజుల శిక్షణలో భాగంగా ఆదివారం ఇక్కడ క్షేత్రస్ధాయిలో చేపల విక్రయంపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా పాలేరులో మత్స్యమార్కెట్‌ను సందర్శించారు. మత్స్య మార్కెటింగ్ విధివిధానాలను తెలుసుకున్నారు. చేపలు మంచి పోషకాహారమని, ఏరూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని తెలిపారు. ఈక్రమంలో ప్రజలు మార్కెట్‌లో లైవ్ ఫిష్ కొనుగలో చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. రవ్వ, బొచ్చ, బంగారుతీగ, కొర్రమేను, ఫంగష్, తలాపియా, చుక్క పాంఫ్రెట్, వాలుగ, కొమ్ముజెల్ల వంటి చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. పచ్చి చేపలతో పాటు ఎండుచేపలను ప్రజలు ఆస్వాదిస్తుంటారన్నారు. దీంతో గ్రామాల్లోనూ, పట్టణాల్లో చేపలకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. అందుకనుగుణంగా చేపల ఉత్పత్తి జరగాలన్నారు. గ్రామాల్లో మత్స్యకారులకు నాణ్యమైన చేపల ఉత్పత్తికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలని విద్యార్థులకు సూచించారు. తాము నేర్చుకున్న అంశాలను మత్స్యకారులకు అవగాహన కల్పిస్తూ చేపల ఉత్పత్తికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శాంతన్న, నాగరాజు, నందిని, పాల్గొన్నారు.