చిరువ్యాపారులపై జులుం
ABN , First Publish Date - 2020-12-20T03:54:17+05:30 IST
చిరువ్యాపారులపై డిజార్టర్ రిసోర్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారు. కాళ్లు పట్టుకున్నా కనికరించటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు
లంచాల వసూలు చేస్తున్నట్లు ఆరోపణ
కమిషనర్ జోక్యం చేసుకోవాలని వేడుకోలు
ఖమ్మంకార్పొరేషన్, డిసెంబరు19: చిరువ్యాపారులపై డిజార్టర్ రిసోర్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారు. కాళ్లు పట్టుకున్నా కనికరించటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నగరంలోని ఇల్లెందు రోడ్‌లో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని రహదారికి ఒక పక్కన ఉంచి, చేపలను విక్రయిస్తున్నాడు. దీనిని చూసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది సదరు చిరువ్యాపారి వద్ద నుంచి కాంటాను లాక్కొని బీభత్సం సృష్టించారు. అందరి ముందే సదరు వ్యక్తి కాళ్లపై పడినా.. కనికరించలేదు. వైరారోడ్‌లో జరిగిన ఈ సంఘటన పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రహదారి పక్కన ఒక మూల ఎవరికి అడ్డురాకుండా వాహనంపై చేపలు విక్రయిస్తుంటే, సదరు చిరు వ్యాపారికి హెచ్చరిక ఇవ్వాలి కానీ.. దౌర్జన్యం చేసి, కాంటాలు లాక్కోవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా డీఆర్‌ఎఫ్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పక్కదారి పట్టిన లక్ష్యం
పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డీఆర్‌ఎఫ్ సబ్బందిని నియమించారు. ఖమ్మంలో మాత్రం లక్ష్యం మాత్రం పక్కదారి పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఏమన్నా ప్రకృతి విపత్తులు సంభవిస్తే సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు వీరిని నియమించారు. అయితే రహదారుల పక్కన ఆక్రమణలు చేసినా, ట్రాఫిక్ అంతరాయం కటిగేలా బండ్లు పెట్టినా వాటిని తొలగిచాలని నగరపాలక సంస్థ అధికారులు డీఆర్‌ఎఫ్ సిబ్బందికి చెప్పారు. ఇదే అదునుగా వారు జులుం ప్రదర్విస్తున్నారు.
అందిన కాడికి
చిరువ్యాపారులపై జులుం చేయటమే కాకుండా వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని డీఆర్‌ఎఫ్ సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. చేపలను తీసుకోవటం, చిరువ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేయటం పరిపాటిగా మారిందని అంటున్నారు. లేకుంటే బండ్లను తీసుకువెళ్లటం, కాంటాలను తీసుకువెళ్లడం చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. డీఆర్‌ఎఫ్ దౌర్జన్యాలపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో కఽథనం ప్రచురితమైంది. పోలీసులను వారి వెంట పంపించారు. తరువాత పట్టించు కోక పోవటంతో మళ్లీ వారి ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికైనా కమిషనర్ డీఆర్‌ఎఫ్ సిబ్బంది అరాచకాలను కోరుతున్నారు.