రంజాన్‌ తోఫా బంద్‌

ABN , First Publish Date - 2020-05-17T10:52:35+05:30 IST

రాష్ట్ర ఏటా నిరుపేద ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా అందించే రంజాన్‌తోఫా కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ఈ సంవత్సరం నిలిచిపోయింది.

రంజాన్‌ తోఫా బంద్‌

కరోనా ఎఫెక్ట్‌తో నిలిచిపోయిన నిధులు 

ఉత్తర్వులు జారీ చేసిన మైనార్టీ సంక్షేమ శాఖ 

వేలమంది పేద ముస్లింలకు నిరాశ 

గత ఏడాదే నిలిచిపోయిన మజీద్‌ మరమ్మతుల నిధులు  


కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 16: రాష్ట్ర ఏటా నిరుపేద ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా అందించే రంజాన్‌తోఫా కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ఈ సంవత్సరం నిలిచిపోయింది. నిధులను రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మైనార్టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్ర వ్యాప్తంగా 4.50లక్షల మంది ముస్లింలు నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం పేద ముస్లింలకు రంజాన్‌ సందర్బంగా ‘దావత్‌-ఏ-ఇఫ్‌తార్‌’ పేర ఇష్తార్‌ విందులను ఏర్పాటు చేసింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ, రంజాన్‌ మాసం ప్రారంభంలో మసీదుల మరమ్మతులకు ఏటా నిధులు కేటాయించేవారు. కాగా గత ఏడాది నుంచి మసీద్‌ల మరమ్మతులకు కేటాయించే ఽనిధులను నిలిపి వేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో నిధులను నిలిపివేస్తున్నట్లు మైనార్టీ శాఖ ప్రకటించడంతో పేద ముస్లింలు నిరాశకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మసీదులకు మరమ్మతులు చేయించేందుకు ఏటారూ.15లక్షలు కేటాయించే వారు. కానీ గత ఏడాదినుంచి ఆ నిఽధులు నిలిచిపోయాయి. తాజాగా ‘దావత్‌ -ఏ-ఇఫ్తార్‌’ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో నిరుపేద ముస్లింలు నిరాశకు గురయ్యారు.  


పేద ముస్లింల పట్ల వివక్ష  తగదు : యాకూబ్‌ పాషా, మైనార్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు

పేద ముస్లింల పట్ల ప్రభుత్వం వివక్షను వీడాలి. లాక్‌డౌన్‌ కారణంగా రంజాన్‌ తోఫాను రద్దు చేయడం బాధాకరం. మద్యం దుకాణాలు, రేషన్‌ దుకాణాలు, బ్యాంకుల వద్ద అడ్డురాని భౌతిక దూరం సమస్య పేద ముస్లింలకు దుస్తుల పంపిణీలోనే వచ్చిందా ? ఇప్పటికైనా ఈ పధకం రద్దుపై పునరాలోచన చేసి పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయాలి.

Updated Date - 2020-05-17T10:52:35+05:30 IST