శ్రీశైలం ప్రమాదంలో.. ముగ్గురు జిల్లా వాసుల మృతి
ABN , First Publish Date - 2020-08-22T11:01:37+05:30 IST
శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిలో
స్వగ్రామాల్లో అలముకున్న విషాదం
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి, ప్రముఖులు
కారేపల్లి/మధిరరూరల్/పాల్వంచ, ఆగస్టు 21: శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు ముగ్గురున్నారు. వీరిలో ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మర్సకట్ల వెంకట్రావ్(44), కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఎట్టి రాంబాబు(40), భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన మాళోత్ కిరణ్ (35) ఉన్నారు.
మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మర్సకట్ల వెంకట్రావ్(44) శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి విధినిర్వహణలో ఉన్న సమయంలో నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి అక్కడున్న ఆరు యూనిట్లకు పొగలు కమ్మేశాయి. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న వారితో పాటు వెంకట్రావు కూడా లోపలే చిక్కుకుపోయారు. మర్సకట్ల పెద్దపుల్లయ్య, రోశమ్మ దంపతులు ఆరుగురు సంతానంలో ఐదోవాడు వెంకట్రావ్. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్రావ్ డిప్లొమా పూర్తిచేసి మొదట ట్రాన్స్‌కోలో సబ్‌ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత పాల్వంచ కేటీపీఎ్‌సలో 6వ స్టేజ్ క్యామ్‌లో సబ్‌ఇంజనీర్‌గా నాలుగేళ్లపాటు పనిచేసి రెండేళ్ల క్రితం అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)గా శ్రీశైలం ప్రాజెక్టుకు ఉద్యోగోన్నతిపై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్న వెంకట్రావ్ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో కన్నుమూశారు. వెంకట్రావ్‌కు భార్య, పదిసంవత్సరాల కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు చాలాఏళ్లక్రితమే కన్నుమూశారు. ఈయన మృతితో మహదేవపురంగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కారేపల్లి మండలంల ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన రాంబాబు తండ్రి లింగయ్య మండలంలోని రేలకాయలపల్లి అశ్రమపాఠశాల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఇటీవలే పదవీవిరమణ పొందాడు. మొదటినుంచి ఆశ్రమాపాఠశాల్లో చదువుకున్న రాంబాబు చాలాకాలం చాలకాలం పాల్వంచలోని కేటీపీఎ్‌సలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తూ 2013లో జెన్కోలో ఎలక్ర్టిషన్‌గా ఉదోగ్యం సంపాదించాడు. అనంతరం శ్రీశైలం వెళ్లిన ఆయన తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు బదిలీపై వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేగ్రామానికి చెందిన ఈసం కృష్ణవేణిని వివాహం చేసుకున్న రాంబాబుకు ఇద్దరు కుమారులున్నారు. గురువారం రాత్రి రాంబాబు విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామ సర్పంచ్ దారవత్ బన్సిలాల్‌తో పాటు పలువురు బంధువులు, గ్రామస్థులు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. రాంబాబు మృతితో బంధులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పాల్వంచ పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన మాళోత్ కిరణ్ (35) తండ్రి కేటీపీఎస్‌లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందటంతో కిరణ్‌కు పదేళ్ల క్రితం డిపెండెంట్ కోటాలో ఉద్యోగం వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో కేటీపీఎస్ పాతప్లాంటు మూసివేయడంతో కిరణ్‌ను ఉమ్మడి నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బదిలీ చేశారు. యాదాద్రిలో పనులు లేకపోవటంతో బదిలీపై వెళ్లిన కార్మికులను వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్‌కో, జెన్‌కో కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రానికి బదిలీ అవగా.. గురువారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందాడు. దీంతో పాల్వంచలోని ఆయన కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కిరణ్‌కు భార్య సునిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్రిప్రమాదం జరగడం, తొమ్మిది మంది మృతిచెందడం పట్ల రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు కన్నుమూయడం దురదృష్టకరమన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాలకమల్‌రాజ్, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకాచౌదరి, హెచ్-142 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రామారావు తదితరులు కూడా సంతాపం తెలిపారు.