1నుంచి పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
ABN , First Publish Date - 2020-05-29T10:03:48+05:30 IST
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అన్ని మునిసిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను

వీడియోకాన్ఫరెన్స్‌లో పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఖమ్మం కలెక్టరేట్, మే 28: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అన్ని మునిసిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం డైరెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆయన అదనపు కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 1నుంచి 8వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. అన్ని మునిసిపాలిటీల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడం, వర్షపునీరు వెళ్లిపోయేలా చూడటం, రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించడం లాంటివి చేసి వర్షాకాల సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు.
దోమలు, వాటి లార్వాను నిర్మూలించేందుకు నివాసిత ప్రాంతాల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్ లాంటివి చేపట్టాలని, ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థలతో పాటు అన్ని మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను నియమించి అవసరమైన మానవ వనరులు వాహనాలు, సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.
ఇళ్లపరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆస్తిపన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని, ఎల్‌ఆర్‌ఎస్ నిధుల నుంచి 70శాతం వరకు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, వైరా, సత్తుపల్లి, మధిర మునిసిపల్ కమిషనర్లు విజయానంద్, సుజాత, సైదులు తదితరులు పాల్గొన్నారు.