రిజర్వాయర్లపై సోలార్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2020-07-14T11:19:14+05:30 IST

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా భారీ నీటి జలాశయాల మీద తేలియాడే సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం

రిజర్వాయర్లపై సోలార్‌ ప్లాంట్లు

నీటిపై తేలియాడే యూనిట్ల నిర్మాణానికి సింగరేణి సమాయత్తం

రెన్యూవబుల్‌ ఎనర్జీ సంస్థతో అధ్యయనం 

సింగరేణి సీఅండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ 


కొత్తగూడెం, జూలై 13: సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా భారీ నీటి జలాశయాల మీద తేలియాడే సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం సమయాత్తమవుతోంది. సీ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ చొరవతో సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల సామర్థ్యంతో తేలియాడే పవర్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం కంపెనీ తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయంతో ప్రతిపాదనలను అధ్యయనం చేస్తోంది. సింగరేణి సీఅండ్‌ఎండీ ఎన్‌. శ్రీధర్‌ ఆదేశంపై టీఎస్‌ఆర్‌ఈడీ సంస్థ వారు ఈ మేరకు రాష్ట్రంలోని పలు భారీ నీటిపారుదల జలాశయాలపై నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి గల అవకాశంపై అధ్యయనం చేశారు.


సోమవారం (జూలై 13వ తేదీన) సింగరేణి సీ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌కు ఒక పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఈ రిపోర్టును వివరించారు. సింగరేణి సంస్థ 500 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ఈ మొత్తం సామర్ధ్యంగల ప్లాంట్‌ను ఒకేసారిగా ఒకే చోట నిర్మించే వీలుందా లేక 100 మెగావాట్ల సామర్ధ్యంతో ఐదు ద శలుగా నిర్మించే అవకాశం ఉందా అన్న విషయంపై లోతుగా చర్చించారు. కరీంనగర్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లోని భారీ సాగునీటి జలాశయాల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్‌) సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి అనువుగా ఉన్న వాటిపై చర్చించారు.


ఈ నీటిపై తేలియాడే ప్లాంట్ల నిర్మాణం వల్ల ఎవరికీ ఏ విధమైనా ఇబ్బంది కలగని విధంగా నిబంధనలకు లోబడి నిర్మాణం జరపడానికి తగిన నిర్దిష్ట ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా సీ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ కోరారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే తన 11 ఏరియాల్లో సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టిన సింగరేణి ఇప్పుడు బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కోసం అడుగులు ముందుకు వేస్తోంది.


ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమ్ర్పించి, విద్యుత్‌ కొనుగోలు అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశముందని సీ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ సమావేశంలో పేర్కొన్నారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎస్‌. శంకర్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌. జానయ్య, సింగరేణి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:19:14+05:30 IST