‘సీతమ్మసాగర్‌’ టెండర్లు పూర్తి

ABN , First Publish Date - 2020-05-29T10:02:53+05:30 IST

దుమ్ముగూడెం వద్ద గోదావరిపై నిర్మించబోతున్న సీతమ్మసాగర్‌ బ్యారేజీ టెండర్లప్రక్రియ

‘సీతమ్మసాగర్‌’ టెండర్లు పూర్తి

ఎల్‌అండ్‌టీకి దక్కిన పనులు

జూన్‌లో దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ పనుల ప్రారంభానికి అవకాశం


ఖమ్మం, మే 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): దుమ్ముగూడెం వద్ద గోదావరిపై నిర్మించబోతున్న సీతమ్మసాగర్‌ బ్యారేజీ టెండర్లప్రక్రియ పూర్తయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఈ పనులు దక్కించుకోగా.. జూన్‌లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీతారామ సాగునీటి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్‌ పేరుతో బ్యారేజీ నిర్మించనున్న విషయం తెలిసిందే. రూ.2,633కోట్లతో గోదావరిపై దుమ్ముగూడెం వద్ద.. సాగు అవసరాలతోపాటు విద్యుదుత్పత్తిని దృష్టిలో పెట్టుకుని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతమ్మసాగర్‌ను నిర్మిస్తున్నారు. గోదావరినదిపై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఆనకట్ట ఉండగా.. అది అప్పట్లో జలరవాణాను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. దానిద్వారా గోదావరిపై లాంచీలు, పడవల ప్రయాణం, కలప, వెదురు వంటి అటవీ ఉత్పత్తులు ఎగువప్రాంతనుంచి రాజమండ్రి  వరకు రవాణా చేసేవారు.


ఈఆనకట్టకు దిగువనే కొత్తగా సీతమ్మసాగర్‌ పేరుతో 37.25టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించనున్నారు. రూ.2633కోట్లతో గోదావరిపై ఒకవైపున దుమ్ముగూడెం, మరోవైపు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిని ఆనుకుని సీతమ్మసాగర్‌ నిర్మాణం కానుంది. 1.50కిలోమీటర్ల పొడవు, 63మీటర్ల ఎత్తు, 3నుంచి6మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ పద్ధతిలో నిర్మించనున్నారు. తద్వారా 37.25టీఎంసీల నీరు గోదావరిలో నిల్వ ఉండనుండగా.. గోదావరి వరద సమయంలో 320మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 8పంపులు కూడా ఏర్పాటుచేయనున్నారు. ఆనకట్టకు ఎడమవైపున 55కిలోమీటర్లు, కుడివైపున 40కిలోమీటర్లు పొడవునా వరదకట్టలు, 12.50 మీటర్ల ఎత్తు, ఆరు మీటర్ల వెడల్పుతో కరకట్టలను నిర్మించనున్నారు. 


టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది..వెంకటకృష్ణ, సీతారామ ఎస్‌ఈ 

సీతమ్మసాగర్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పనులను దక్కించుకుంది. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ అనంతరం జూన్‌లో ప్రాథమిక పనులను ప్రారంభిస్తాం. సాగునీటి అవసరాలతో పాటు 320మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతమ్మసాగర్‌ నిర్మితం కానుంది. జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించే హైడల్‌ పవర్‌ స్టేషన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. అలాగే వర్షాకాలంలో గోదావరి వరదతో వృథాగా పోయే నీటిని ఉమ్మడి జిల్లా ఆయకట్టుకు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్‌ బ్యారేజీకి రూపకల్పన జరిగింది. 

Updated Date - 2020-05-29T10:02:53+05:30 IST