ఏజెన్సీలో విత్తన మాఫియా

ABN , First Publish Date - 2020-06-25T10:14:28+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు విత్తన వ్యాపారులకు, దళారులకు కాసుల పంట పండిస్తోంది.

ఏజెన్సీలో విత్తన మాఫియా

గ్రామాల్లో యథేచ్చగా మొక్కజొన్న విత్తనాల అమ్మకాలు

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని రైతులు


ఇల్లెందు, జూన్‌ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు విత్తన వ్యాపారులకు, దళారులకు కాసుల పంట పండిస్తోంది. వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న సాగుపై నిషేధం విధించిన విత్తనాల అమ్మకాలు జరిపితే పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిషేధాన్ని పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత రైతులు మొక్కజొన్న సాగుకే మొగ్గు చూపుతుండడంతో విత్తన వ్యాపారులకు ఇదో అవకాశంగా మారింది. అధికారికంగా విత్తనాల అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో అడ్డదారిలో కొందరు వ్యాపారులు, దళారులు మొక్కజొన్న విత్తనాలను అధిక రేట్లకు రైతులకు అంటగడుతున్నారు. ఇదే అదునుగా కొందరు దళారులు మీడియా, పోలీసుల పేరుతో వ్యాపారులను బెదిరిస్తూ మక్క విత్తనాల దందా సాగిస్తున్నట్లు సమాచారం. దాంతో నిషేదం ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు యథాతథంగా కొనసాగుతుండటం గమనార్హం.


ఇల్లెందు, ఆళ్ళపల్లి, గుండాల, టేకులపల్లి, సింగరేణి మండలాల్లో సాగు నీటి సౌకర్యాలు లేని  పోడు భూముల్లో వరి సాగు సాధ్యం కాకపోవడం, కోతుల బెడదతో కంది సాగుకు రైతులు వెనుకడుగు వేయడం, పత్తి సాగుకు పోడు భూములు, ఏజెన్సీ భూములు అనుకూలం కాకపోవడంతో రైతులు అనివార్యంగా మొక్కజొన్న సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో మహబూబాబాద్‌, నర్సంపేట, ఇల్లెందు, కొత్తగూడెం పట్టణాలతో ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి కొందరు డీలర్లు భారీగా మొక్కజొన్న విత్తనాలను దిగుమతి చేసుకొని ఏజెన్సీ గ్రామాల్లో అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఏజెన్సీ మండలాల్లో 70 శాతం మక్కసాగు పూర్తి చేశారు.  


ఏజెన్సీ గ్రామాల్లో జోరుగా విత్తనాల అమ్మకం

ఏజెన్సీ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో మొక్కజొన్న విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తాల్లో దిగుమతి చేసుకున్న విత్తనాలను పట్టణాల్లోని కొందరు లెసెన్స్‌ విత్తన విక్రయదారులు గ్రామాల్లో నిల్వచేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విత్తనాల నాణ్యతా ప్రమాణలు పరీక్షించేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిగా విత్తనాల విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ప్యాకెట్‌ విత్తనాలపై రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు ధరకు అమ్మకాలు సాగిస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏజెన్సీ రైతులు కొనుగోలు చేస్తున్నారు.


గ్రామాల్లో రాజకీయ అండదండలున్న కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా మక్క విత్తనాల విక్రయాలు సాగిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇదే అదునుగా కొందరు దళారులు మీడియా, పోలీసుల పేరుతో గ్రామాల్లోని విత్తనాల అమ్మకందారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇల్లెందు పట్టణంలో శనివారం రాత్రి పోలీసులు తనిఖీ చేసి 60 ఫ్యాకెట్ల మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు పోలీసుల సమాచారం మేరకు ఇల్లెందులో ఆదివారం తనిఖీలు చేసి మొక్కజొన్న విత్తనాలు అమ్ముతున్న ఓ దుకాణంపై కేసు నమోదు చేసినట్లు వ్యవసాయ అధికారి పి. సతీష్‌ తెలిపారు.

Updated Date - 2020-06-25T10:14:28+05:30 IST