కదంతొక్కారు..

ABN , First Publish Date - 2020-11-27T05:10:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. సమ్మెకు మద్దతుగా సీపీఎం, సీపీఐ, ఎన్డీ, కాంగ్రెస్‌, టీడీపీతో పాటు పలు ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.

కదంతొక్కారు..
ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విపక్ష పార్టీలు, ప్రజా, కార్మికసంఘాల నాయకులు, కార్యకర్తలు

కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మికుల నిరసనలు 

ఇరుజిల్లాల్లో సార్వత్రిక సమ్మె విజయవంతం

మూతపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు

డిపోలకే పరిమితమైన బస్సులు

సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు

ఖమ్మం (ఖమ్మం ప్రతినిధి)/కొత్తగూడెం, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  విజయవంతమైంది. సమ్మెకు మద్దతుగా సీపీఎం, సీపీఐ, ఎన్డీ, కాంగ్రెస్‌, టీడీపీతో పాటు పలు ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, ప్రధాన రహదారులపై నిరసనలకు దిగారు. ప్రభుత్వరంగ, ప్రైవేట్‌ రంగ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి మధిర, వైరా, కూసుమంచితో పాటు పలు మండల కేంద్రాల్లో విపక్షాల నేతలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. దుకాణాలను బంద్‌ చేయించారు. ఓ వైపు వర్షం పడుతున్నా ఆయా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచే డిపోలు, బస్లాండ్ల వద్ద బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఖమ్మంలో వామపక్షాలు, కాంగ్రెస్‌, టీడీపీతో పాటు పలు కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెవిలియన్‌గ్రౌండ్‌ నుంచి ధర్నాచౌక్‌వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌తోపాటు ఆయా పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక చట్టాలను ఉపసంహరించాల్సిందే :నేతలు

ధర్నాచౌకవద్ద జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్‌ వ్యాపార సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని ఆరోపించారు. రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలపై పునఃసమీక్షించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం ధర్నాచౌక్‌ వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, వామపక్షాల నాయకులు సింగు నర్సింహారావు, జిరామయ్య, బీజీక్లెమెంట్‌, ఆవుల వెంకటేశ్వర్లు, పోటు కళావతి, ఆవుల అశోక్‌, మందా వెంకటేశ్వర్లు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, విష్ణువర్ధన్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఝాన్సీ, శ్రీకాంత్‌, రామారావు, పాషా, విద్యార్థి, కార్మిక సంఘాలు యువజన సంఘాల నాయకలు తదితరులు పాల్గొన్నారు.  

సమ్మెకు సింగరేణి కార్మికుల మద్దతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కొత్తగూడెంలోని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోనూ కార్మికులు సమ్మెకు మద్దతుగా కార్మికులు విధులను బహిష్కరించారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపారు. దీంతో సుమారు 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కూడా సమ్మెకు  మద్దతు తెలపడంతో ఈ సమ్మె విజయవంతమైంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెలో పాల్గొనడంతో విజయవంతమైంది. సింగరేణిలో బీఎంఎస్‌ సమ్మెకు దూరంగా ఉంది. 

Updated Date - 2020-11-27T05:10:28+05:30 IST