ఆన్‘లైన్’లో ఉండాల్సిందే!
ABN , First Publish Date - 2020-10-03T11:12:16+05:30 IST
‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక పోయింది’ అన్నట్లుంది ఆన్‌లైన్‌లో ఇసుక పంపిణీ తీరు.. ప్ర

దుర్వినియోగమవుతున్న కొత్త ఇసుక పాలసీ
దళారులు, డబ్బున్నవారికే దక్కుతున్న ఆన్‌లైన్ బుకింగ్
నెలలో పదిరోజులే పంపిణీ 8 నిలిచిన నిర్మాణాలు
అశ్వారావుపేట, అక్టోబరు 2: ‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక పోయింది’ అన్నట్లుంది ఆన్‌లైన్‌లో ఇసుక పంపిణీ తీరు.. ప్రభు త్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ వల్ల ఖనానాకు ఒక్క పైసా అద నపు ఆదాయం రాకపోగా వినియోగదారులపై రెట్టింపు భారం పడుతోంది. ఇక మైనింగ్ శాఖ నిబంధనలను అనుసరించి ఇసుకను అనుమతించడంవల్ల నెలలో వారం రోజులు కూడా ఇసుక అందుబాటులో ఉండటం లేదు. ఆన్‌లైన్ ప్రారంభమైన వెంటనే డబ్బులున్న దళారీలు ఏదో పేర్లతో భారీగా ఒకేసారి ఇసుకను బుక్ చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి, దళారీలకే ఇసుక దొరకుతుంది. వాస్తవంగా ఇసుక అవసరమైన లబ్ధిదారులకు ఇసుక లభించడం లేదు. దాంతో తప్పనిసరి పరి స్థితుల్లో దళారుల వద్ద అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ట్రాక్టర్ యజమానులకే లాభదాయం...
అశ్వారావుపేట మండలంలో గాడ్రాల, కుడుములపాడు, నారాయణపురం, గుమ్మడపల్లి, నెమలిపేట, అనంతారం వాగుల్లో రీచ్‌లను ఏర్పాటు చేశారు. గతంలో రీచ్‌ల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఆ విధానాన్ని రద్దు చేసి ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రజల కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో కూడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1000లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అయితే ఈ విధానంలో కిలోమీటరుకు రూ.80ల చొప్పున రవాణా చార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్క రవాణా చార్జీలకే ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2400ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ట్రాక్టర్ లోడింగ్ చార్ట్ మరో రూ.400లు ట్రాక్టర్ యజమానికి చెల్లిస్తున్నారు. దాంతో మొత్తం కలిపి ఒక్క ట్రాక్టర్ ఇసుక రూ.4,500లకు లభిస్తుంది. ఇది సామన్య ప్రజలకు తీవ్ర భారంగా మారింది. ఆన్‌లైన్ విధానంతో స్థానికులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. డబ్బులున్న స్థానికేతరులే పెద్ద మొత్తంలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటుండడంతో స్థానికులకు స్థానికులకు ఇసుక కొరత ఏర్పడుతోంది. ఈ పద్దతితో నెలలో వారం రోజులు కూడా ఇసుక అందుబాటులో ఉండటం లేదు.
దళారీల పాలవుతున్న ఇసుక..
మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక కనీస స్థాయిలో నిల్వలు ఉంటేనే బుకింగ్‌ను అనుమతులిస్తున్నారు. గత రెండు నెలలుగా అశ్వారావుపేటలో ఆన్‌లైన్ బుకింగ్‌లు లేవు. అయితే ఇసుక కొరతను కొందరు దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకుంటున్న దళారులు ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి నిల్వ ఉంచుకుంటున్నారు. ఇసుక మార్కెట్‌లో దొరకని సమయంలో ఒక్కో ట్రక్కు ఇసుకను రూ.8వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాక దూర ప్రాంతం కారణం చూపి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం వల్ల వారికి రవాణా చార్జీల కింద పెద్ద మొత్తంలో సొమ్ములు మిగులుతున్నాయి. స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండటం లేదు. ఇక స్థానిక వాగుల్లో ఇసుక నిల్వలు భారీగానే ఉండడంతో కొందరు ట్రాక్టర్ యజమానులు రాత్రి వేళల్లో అధికారుల కళ్లుకప్పి ఇసుకను అక్రమంగ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైన అదికారులు ఆన్‌లైన్ ఇసుక పంపణీపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.